ట్యాపింగ్‌ కేసు వేరే బెంచ్‌కి బదిలీ

ABN , First Publish Date - 2020-09-03T08:36:32+05:30 IST

హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేస్తూు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌,

ట్యాపింగ్‌ కేసు వేరే బెంచ్‌కి బదిలీ

ఫైలు సీజే ముందుంచాలి.. రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం

 

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేస్తూు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌పై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం ఆధారంగా విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీ గ్రేస్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


ఫోన్‌ ట్యాపింగ్‌పై ప్రత్యేకంగా ఐపీఎస్‌ అధికారిని నియమించారని, ఆ వివరాలను అదనపు అఫిడవిట్‌లో దాఖలు చేస్తానని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ పేర్కొనడంతో.. ఆ వివరాలను ప్రధాన అఫిడవిట్‌లోనే పొందుపరిచి, సవరించిన అఫిడవిట్‌ను మళ్లీ దాఖలు చేయాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. ఈ పిల్‌పై బుధవారం మరోమారు విచారణ జరగ్గా.. గతంలో ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు తాను సవరించిన అఫిడవిట్‌ను దాఖలు చేశానని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ వివరించారు.


ధర్మాసనం స్పందిస్తూ.. ఈ పిటిషన్‌ను గతంలో వేరే ధర్మాసనం పరిశీలించినందున అక్కడకు పంపడమే సమంజసమని పేర్కొంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. శ్రావణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... న్యాయమూర్తుల కదలికలను ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు, 40మంది పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు సవరించిన అఫిడవిట్‌లో పొందుపరిచినట్లు వివరించారు. 


Updated Date - 2020-09-03T08:36:32+05:30 IST