హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బదిలీ!?

ABN , First Publish Date - 2020-12-15T09:11:20+05:30 IST

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించినట్లు తెలిసింది.

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బదిలీ!?

జస్టిస్‌ మహేశ్వరికి స్థాన చలనం?

తెలంగాణ సీజే జస్టిస్‌ చౌహాన్‌ కూడా!

దేశవ్యాప్తంగా ఐదారు హైకోర్టులకు 

కొత్త ప్రధాన న్యాయమూర్తులు

ఏడెనిమిది మంది జడ్జిలూ బదిలీ

తెలుగు రాష్ట్రాలకు సీనియర్‌ జడ్జిలు!

సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం!?


న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించినట్లు తెలిసింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం ఐదారు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం కలగనున్నట్లు సమాచారం. అలాగే... దేశవ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది మంది హైకోర్టు న్యాయమూర్తులను కూడా బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించినట్లు తెలిసింది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌లతోపాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని తీర్మానించినట్లు తెలిసింది. ఏపీ హైకోర్టులో సీజే తర్వాత అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నారు. ఇతర న్యాయమూర్తుల బదిలీలలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా సీనియర్లయిన జడ్జిలను నియమించనున్నట్లు సమాచారం.


వీరు ప్రధాన న్యాయమూర్తి తర్వాతి స్థానంలో (నెంబర్‌ 2) ఉండి, అవసరాన్ని బట్టి తాత్కాలిక సీజేగా (యాక్టింగ్‌ సీజే)బాధ్యతలు నిర్వహించే స్థాయిలో ఉంటారని తెలుస్తోంది. త్వరలో సుప్రీంకోర్టు జడ్జిలు అయ్యే అర్హతలున్న జడ్జిలను తెలుగు రాష్ట్రాలకు పంపించనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌లను ఏ రాష్ట్రాలకు  బదిలీ చేశారు.. వారి స్థానంలో కొత్తగా ఎవరిని నియమించారనే విషయాలు బుధవారం లేదా గురువారం తెలిసే అవకాశముంది.

ఏడాదిన్నర లోపే...: జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ గత ఏడాది జూన్‌ 23న తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక... ఏపీ  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబరు 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దుతో మొదలుకుని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు అర్ధంతరంగా ఉద్వాసన పలకడం వరకు జగన్‌ సర్కారు తీసుకున్న అనేక చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే.


ఈ క్రమంలో... వైసీపీ వర్గాలు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని దూషణలు చేయడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. అంతేకాదు... న్యాయమూర్తులపై జగన్‌ ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు కూడా చేశారు. రహస్యంగా ఉంచాల్సిన ఆ లేఖను... వ్యూహాత్మకంగా బహిర్గతం చేయడం పెను వివాదం సృష్టించింది. ఏపీ హైకోర్టు సీజేను బదిలీ చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ కుట్ర చేస్తున్నారని సీపీఐ అగ్రనేత నారాయణ ఆదివారమే సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. 

Updated Date - 2020-12-15T09:11:20+05:30 IST