మొన్న మండలి రద్దు.. నిన్న ఎస్‌ఈసీ నేటి టార్గెట్‌ హైకోర్ట్‌!

ABN , First Publish Date - 2020-11-07T09:03:38+05:30 IST

‘రాజధానుల బిల్లు ఆమోదించలేదని శాసన మండలిని మొన్న రద్దు చేశారు, నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)

మొన్న మండలి రద్దు.. నిన్న ఎస్‌ఈసీ  నేటి టార్గెట్‌ హైకోర్ట్‌!

‌పౌరహక్కులను రక్షించలేకపోతే మేమెందుకు? 

రాష్ట్ర సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

రిజిస్ట్రార్‌ జనరల్‌  ఫిర్యాదు చేస్తేనే పోలీసులు పట్టించుకోలేదు

కీలక నిందితులను తొలగించారు

చీలికలు పేలికలుగా పది ఎఫ్‌ఐఆర్‌లు

ఇష్టానుసారంగా అక్రమ నిర్బంధాలా?

మండిపడ్డ హైకోర్టు ధర్మాసనం 

రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న వివరాలన్నీ మా ముందుంచండి

‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేలుస్తాం

‘హెబియస్‌’ పిటిషనర్లకు సూచన


ఇదేం పద్ధతి..?

 సోషల్‌ మీడియాలో హైకోర్టుకు వ్యతిరేకంగా వచ్చిన వ్యాఖ్యలపై సాక్షాత్తూ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు చేసినా రెండు రోజుల వరకూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఆ తర్వాత చీలికలుపేలికలు చేసి పది రకాల ఎఫ్‌ఐఆర్‌లు తయారు చేశారు. అయితే అందులో ముఖ్యమైన నిందితులను వదిలేశారు.


పోలీసులు ఇష్టానుసారంగా అక్రమ నిర్బంధాలు చేపడతారా? మా వద్దకు కేసులు వచ్చాక కూడా పౌరుల హక్కులను సంరక్షించలేకపోతే ఇక ఇక్కడ మేమెందుకు?

హైకోర్టు ధర్మాసనం


అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘రాజధానుల బిల్లు ఆమోదించలేదని శాసన మండలిని మొన్న రద్దు చేశారు, నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వ్యవహారంలోనూ అలాగే వ్యవహరించారు.. ఇప్పుడు మూడో టార్గెట్‌ హైకోర్టు.. ఇదేం పద్ధతి’ అని హైకోర్టు రాష్ట్రప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ఉన్నత న్యాయస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సాక్షాత్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు చేస్తేనే పోలీసులు పట్టించుకోలేదని.. రెండ్రోజుల తర్వాత ముఖ్యమైన నిందితులను వదిలేసి.. చీలికలు పేలికలు చేసి పది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని ఆక్షేపించింది. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో గ్రహిస్తున్నామని పేర్కొంది. ‘పోలీసులు ఇష్టానుసారంగా అక్రమ నిర్బంధాలు చేపడతారా? పౌర హక్కులను సంరక్షించలేకపోతే ఇక మేమెందుకు’ అని కటువుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో అదుపు తప్పిన పరిస్థితుల నేపథ్యంలో.. ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేల్చేందుకు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లతో పాటు గతంలో హైకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ వాదనలు వినిపించాలని, ఆ తీర్పులను కూడా తమ ముందుంచాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు సూచించింది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల పదో తేదీకి వాయిదావేసింది.


ఇది హైకోర్టు పరిధిలోకి రాదు..

అక్రమ నిర్బంధానికి సంబంధించి దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేలుస్తామని, దీనిపై వాదనలు వినిపించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ధర్మాసనం ముందు మరోమారు విచారణ జరిగింది. ఓ దంపతులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వ ప్రత్యేక కౌన్సిల్‌, సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు కొనసాగించారు. ‘పిటిషనర్లు పోలీసులపై చేసిన ఆరోపణలు నిరూపణ కాలేదు కాబట్టి ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి రాదు. అవి నిరూపితం కానందున వివాదాస్పద అంశాలపై హైకోర్టు పరిధిలో విచారణ చేయడం తగదు. ఎవరినైతే పోలీసులు తీసుకెళ్లారో.. వారిపై అనేక ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తుల కోసం హైకోర్టు ఇంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారిని ఇప్పటికే కింది కోర్టులో హాజరుపరచినందున, ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదు. న్యాయవాది ఇంటిపై జరిగిన దాడికి, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారంపై జరిగిన జ్యుడీషియల్‌ రిపోర్టులో లోపాలున్నాయి.


కాబట్టి ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోరాదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో పోలీసు ఉన్నతాధికారులెవరూ లేనందున.. పోలీసులు నిర్బంధించిన వ్యక్తులు క్రిమినల్స్‌ అయినందున.. నిర్బంధానికి గురైనట్లు చెబుతున్న వారిపై ఎలాంటి పోలీసు వేధింపులు లేనందున.. ఈ కేసును సీబీఐకి గానీ, ఎలాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని వాదించారు.


కట్టుకథలతో తప్పుదోవ పట్టించే యత్నం..

ప్రత్యేక కౌన్సిల్‌ వాదనపై పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.రవితేజ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘పిటిషనర్‌ లేవనెత్తిన వివాదాస్పద అంశాలపై ఇప్పటికే జ్యుడీషియల్‌ విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ న్యాయాధికారి విచారించి నివేదిక అందించారు. కాబట్టి ఇది హైకోర్టు పరిధిలోకి రాదనడం సబబు కాదు. అక్రమంగా నిర్బంధించడం.. వారిని బలవంతంగా అపహరించుకుపోవడం పిటిషనర్ల జీవించే హక్కును కాలరాయడమే. అలా కాలరాయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి దానిపై విచారణ చేసే అధికారం హైకోర్టుకు ఉంది. నేరారోపణలున్నాయన్న వంకతో ఎవరినైతే పోలీసులు తీసుకెళ్లారో.. వారిపై కేసులన్నీ పోలీసుల నిర్బంధం తర్వాత నమోదైనవే. అవి కేవలం ఆరోపణలే.. నిరూపితం కాలేదు.. శిక్షా పడలేదు కాబట్టి వారిని క్రిమినల్స్‌ అనడానికి వీల్లేదు. వారు క్రిమినల్స్‌ కాబట్టి కేసు విచారణార్హం కాదనలేరు.


న్యాయవాది ఇంటికిపై దాడికి, ఈ కేసుకు సంబంధం లేదనడం సరి కాదు. ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన న్యాయవాది ఇంట్లో తనిఖీలు చేసినట్లు పోలీసులే జ్యుడీషియల్‌ విచారణలో అంగీకరించి.. ఇప్పుడు కట్టుకథలు చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు జ్యుడీషియల్‌ రిపోర్టును ఆమోదిస్తున్నారు.. మరోవైపు దానిలో లోపాలున్నాయని చెబుతున్నారు’ అని ఆక్షేపించారు. జ్యుడీషియల్‌ విచారణలో లోపాలుంటే.. అదే నివేదిక ఆధారంగా డీజీపీ కొంతమంది బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల తర్వాతే స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కేసు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘ఎక్కడిదాకో ఎందుకు? సోషల్‌ మీడియాలో హైకోర్టుకు వ్యతిరేకంగా వచ్చిన వ్యాఖ్యలపై సాక్షాత్తూ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు చేసినా రెండు రోజుల వరకూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఆ తర్వాత చీలికలు పీలికలు చేసి పది రకాల ఎఫ్‌ఐఆర్‌లు తయారు చేశారు. అయితే అందులో ముఖ్యమైన నిందితులను వదిలేశారు. ఆ విషయాన్ని హైకోర్టు గుర్తించింది’ అని వ్యాఖ్యానించింది. 


ఇక మేమెందుకు?

కొన్ని కేసుల్లో పోలీసులు అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తున్నారని.. కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవలసి వస్తోందని, ఇందులో భాగంగా పోలీసులపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో ప్రాథమికంగా తేల్చేందుకే రెండు కేసులను సీబీఐకి అప్పగించామని ధర్మాసనం పేర్కొంది. ‘మా వద్దకు కేసులు వచ్చాక కూడా పౌర హక్కులను సంరక్షించలేకపోతే ఇక ఇక్కడ మేమెందుకు’ అని కటువుగా వ్యాఖ్యానించింది. చాలా అంశాలు తమ దృష్టిలో ఉన్నాయని పేర్కొంది. ‘సోషల్‌ మీడియా తదితర అన్ని కేసులనూ పరిశీలించబోతున్నాం. వాటన్నిటికీ సంబంధించి పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వద్ద ఉన్న వివరాలు అందించాలి. ఈ పిటిషన్లతో పాటు, సోషల్‌ మీడియా వ్యవహారం, ఇతర పిటిషన్లు, ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా, రాజ్యాంగ ప్రక్రియ అమలులో ప్రభుత్వం విఫలమైందా లేదా అన్నదానిపై వాదనలు వినిపించండి’ అని పిటిషనర్లకు సూచించింది. అనంతరం రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తాము తేలుస్తామని వ్యాఖ్యానించింది.


ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం జోక్యం చేసుకుంటూ.. ఏయే అంశాలకు సంబంధించిన కేసులను పరిగణనలోకి తీసుకుంటున్నారో తెలియజేస్తే, తామూ స్పందిస్తామని, ఆ మేరకు వాదనలు వినిపిస్తామని తెలిపారు. ధర్మాసనం బదులిస్తూ.. ఏ న్యాయస్థానానికి సంబంధించిన ఉత్తర్వులనైనా పరిగణనలోకి తీసుకునే విస్తృతాధికారం కోర్టుకు ఉందని ఽస్పష్టం చేసింది. హైకోర్టులో జరిగిన అనేక కేసులను పరిశీలించగలమని, ముఖ్యంగా పోలీసు శాఖకు సంబంధించినవెన్నో ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు సూచించామని, ఆదేశాలు కూడా ఇచ్చామని స్పష్టం చేసింది. 


సరిగా దర్యాప్తు సాగకుంటే మీ జేడీని పిలిపిస్తాం

గుంటూరుకు చెందిన వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వ్యవహారాన్ని హైకోర్టు గతంలో సీబీఐ దర్యాప్తునకు అప్పగించిన విషయం తెలిసిందే. శుక్రవారం విచారణ సందర్భంగా సీబీఐ పీపీ ఎ.చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంపై ఆగస్టు 11న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ పురోగతిపై నివేదిక అందించామని వివరించారు. ఆ నివేదిక ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించినదే కదా అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ను పిలిపించాలని ఆదేశించబోయింది. అయితే ఇప్పటికే 20 మంది సాక్షులను విచారించామని, కాల్‌ డేటాను కూడా సేకరించి, నిపుణులకు పంపించామని పీపీ చెప్పారు. కేసును పర్యవేక్షిస్తున్న అదనపు ఎస్పీ ఇటీవలే వచ్చారని, పూర్తి వివరాలు అందిస్తామని, అందుకు గడువు కావాలని అభ్యర్థించారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దర్యాప్తు సరిగా, త్వరగా జరగని పక్షంలో సీబీఐ జేడీని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Updated Date - 2020-11-07T09:03:38+05:30 IST