ఒక్క ప్రెస్‌నోట్.. తిరుపతి బీజేపీలో తీవ్ర చర్చ..!
ABN , First Publish Date - 2020-10-03T17:34:24+05:30 IST
తిరుపతి బీజేపీలో నేతలు భిన్నస్వరాలు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. జగన్ డిక్లరేషన్ వ్యవహారంలో కమలదళంలోని ఓ కీలక నేత వీధి పోరాటానికి సిద్ధపడగా..

తిరుపతి బీజేపీలో నేతలు భిన్నస్వరాలు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. జగన్ డిక్లరేషన్ వ్యవహారంలో కమలదళంలోని ఓ కీలక నేత వీధి పోరాటానికి సిద్ధపడగా.. ఆ పోరాటానికి పార్టీకి సంబంధం లేదని మరో ముఖ్య నాయకుడు ప్రకటించారు. ఇంతకీ వారెవరు? ఆ ఇద్దరూ పరస్పరం విరుద్ధంగా వ్యవహరించడం.. తిరుపతి బీజేపీలో ఏ చర్చకు దారితీసింది?
ఆయన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్లైంది..
ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రంగా భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతుంటాయి. నిజానికి తిరుమల, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండటంతో.. ఇక్కడ కొండపైన, కింద కాషాయ దళం నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే తిరుపతి బీజేపీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు.. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వ్యవహారంలో బయటపడి రచ్చగా మారాయనే చర్చ జరుగుతోంది. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రావటానికి కొద్ది రోజుల ముందు.. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తేనెతుట్టెని కదిపారు. తిరుమలకు వచ్చే వారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అసవరం లేదనేది అందులోని సారాంశం. అయితే ఎవ్వరూ అడగకముందే.. వై.వి.సుబ్బారెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. హిందూ దేవాలయాలపై వరుస దాడుల సమయంలో వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన.. అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. శ్రీవారి భక్తులు, పీఠాధిపతులు, రాజకీయ పార్టీల నాయకులు పలురకాలుగా స్పందించడం, మంత్రి కొడాలి నాని ప్రధాని నరేంద్రమోదీ గురించి నోరు జారడం వంటివి జరిగాయి. కొడాలి వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేసినా లాభం లేకపోయింది.
ఆయన నిరసనకు.. పార్టీకి సంబంధం లేదు..
ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సతీసమేతంగానే తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని, డిక్లరేషన్ ఇవ్వాలని కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు తిరుపతిలోని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి కూడా.. జగన్ పర్యటను అడ్డుకుంటామని ప్రకటించారు. జగన్ తిరుమల పర్యటన జరిగిన రోజున చిత్తూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అదే విధంగా కమలం పార్టీ నాయకులను కూడా గృహ నిర్బంధం చేశారు. అయితే అప్పుడు భాను ప్రకాశ్ రెడ్డి తన ఇంటి ముందు నుంచి రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేయగా.. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అదే రోజున సాయంత్రం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సీఎం పర్యటనను అడ్డుకోవాలనేది తమ పార్టీ విధానం కాదనీ, నిరసనలకు తమ పార్టీకి సంబంధం లేదనీ స్పష్టం చేశారు. ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌ను పోలీసువర్గాలు అదే పనిగా పలు మీడియా గ్రూపులలో పోస్ట్ చేశాయి. ఎందుకు ఇలా? అంటే.. అంతకుముందు రోజున బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. తెలుగుదేశం నిరసనలకు పిలుపునిచ్చింది కాబట్టి.. తాము కూడా అదే కార్యక్రమం చేస్తే టీడీపీని ఫాలో అయినట్టుగా ఉంటుందని పదాధికారుల సమావేశంలో చర్చకు వచ్చిందట. దీంతో వారు తర్జనభర్జన పడి.. చివరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వద్దనుకున్నారని సమాచారం.
ఇంతటితోనైనా ఈ గ్రూపుల గోల ఆగుతుందా..?
ఇదిలాఉంటే, తిరుపతి బీజేపీలోని భాను ప్రకాశ్ రెడ్డి తదితర నాయకులు ఇటీవల బాగా ఫోకస్ అవుతుండటాన్ని పార్టీలోని మరో వర్గం జీర్ణించుకోవట్లేదని టాక్. తిరుపతి బీజేపీ అంటే భాను, సామంచి తప్ప.. ఇక ఎవ్వరూ లేరా? అనే భావన పెరగటం కూడా ఇందుకు కారణమని చర్చ జరుగుతోంది. వెంకయ్యనాయుడుకి తొలి నుంచి దగ్గరగా ఉన్న భానుప్రకాశ్ రెడ్డికి పోటీగా సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిని ఓ వర్గం నాయకులు ప్రోత్సహిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయనతో ఆ రోజున భాను ప్రకాశ్‌రెడ్డి నిరసన కార్యక్రమానికి, తమ పార్టీకి సంబంధం లేదని ప్రకటన ఇప్పించారని తెలుస్తోంది. మొత్తంమీద జగన్ పర్యటన రోజున తిరుపతి బీజేపీ నేతలు పరస్పర విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. వారి వైఖరి నగరంలో పార్టీ ప్రతిష్టని పలుచన చేసిందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. మరి తిరుపతి బీజేపీలో గ్రూపుల గోల.. ఇంతటితోనైనా ఆగుతుందా? లేక ఇంకా అధికమవుతుందా? అని చర్చ జరుగుతోంది.