దీని భావమేమి తిరుమలేశా?
ABN , First Publish Date - 2020-03-08T09:24:35+05:30 IST
ఇది సర్కారు వారి సరికొత్త కంపెనీ! కాసుల కోసం విసురుతున్న తెలివైన పాచిక! తనవికాని సొమ్ములతో సోకులకు పోతూ... పబ్బం గడుపుకొనే వినూత్న ప్రణాళిక! దీని పేరే...

వెంకన్న సొమ్ముపై సర్కారు కన్ను?
సంస్థల నిధుల నిర్వహణకు కొత్త కంపెనీ
ట్రస్టులు, కార్పొరేషన్ల నుంచి సేకరణ
డిపాజిట్లు, మార్కెట్‌లో పెట్టుబడులు
‘ఎండోమెంట్స్’ పేరిట హుండీలకూ టెండర్
టీటీడీలోనే అధికంగా కాసుల గలగల
ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ పేరిట
సొంత అవసరాలకు సొమ్ములు?
డిపాజిట్ల ఆశ చూపి బ్యాంకులనూ
దారికి తెచ్చుకునే చాన్స్
రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త గేమ్‌ప్లాన్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఇది సర్కారు వారి సరికొత్త కంపెనీ! కాసుల కోసం విసురుతున్న తెలివైన పాచిక! తనవికాని సొమ్ములతో సోకులకు పోతూ... పబ్బం గడుపుకొనే వినూత్న ప్రణాళిక! దీని పేరే... ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎ్‌సఎ్‌ఫఎస్). ఇది రంగంలోకి దిగితే.... అన్నిటికంటే ఎక్కువగా, ముందుగా చిల్లు పడేది ఏడుకొండల వేంకటేశ్వరుడి హుండీకే! ‘మేలు చేస్తాం... మిమ్మల్ని ఉద్ధరిస్తాం’ అని పైకి చెబుతూ, ఆలయాలతోపాటు ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర సంస్థల నిధులన్నింటినీ ‘ఆకర్ష మంత్రం’ వేసినట్లుగా ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ లాగేసుకోవచ్చు. ఆ డబ్బుతో సంస్థ వడ్డీ వ్యాపారం చేయొచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులూ పెట్టవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా... ఎప్పటికప్పుడు ఖజానాలో నిధుల కొరత లేకుండా, తక్షణావసరాలు తీర్చుకునేందుకు ఈ సంస్థ ఒక ‘కామధేనువు’లా మారనుంది. ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ప్రభుత్వ పెద్దగా ఉన్న రాష్ట్ర గవర్నర్‌తోపాటు మరో ఆరుగురికి షేర్‌లు కేటాయించారు. 100 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేస్తున్నామంటూ... 20 లక్షల షేర్లు జారీ చేశారు. దీనికి అనుమతి కోసం ఆర్బీఐకి త్వరలోనే దరఖాస్తు చేయనున్నారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం జీవో నెంబర్ 18 జారీ చేసింది. ఈ ఒక్క సంస్థ ఏర్పాటు వెనుక అనేక లక్ష్యాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఏమిటి... ఎలా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సర్కారు రోజువారీ అవసరాలు, ఉద్యోగుల వేతనాల కోసం నానా కష్టాలు పడుతోంది. ఓవర్ డ్రాఫ్ట్‌లకు వెళుతోంది. ప్రతినెలా మొదటివారం అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. దీంతో బ్యాంకులను దారికి తెచ్చుకునేందుకు సొంతంగా ఓ ప్రభుత్వ రంగ బ్యాంకును ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. కానీ, అదంత ఈజీ కాదని తేలడంతో ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఒక ‘మనీ ప్లాన్’ మొదలుపెట్టారు. ఆయా సంస్థల వద్ద ఉన్న నగదును మరింత సమర్థంగా, లాభదాయకంగా మార్చేందుకు ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ ఒక ‘ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌మెంట్’ వ్యవస్థలా సేవలు అందిస్తుందని తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ స్వయం ప్రతిపత్తి ఉన్న బోర్డులు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల నుంచి నిధులు తీసుకుంటారు. ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ జారీ చేసే ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లు, డిబెంచర్లు, నగదు డిపాజిట్లు లేదా ఇతర స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఇన్వె్‌స్టమెంట్ పద్ధతుల ద్వారా సేకరిస్తారు. అలా సేకరించిన నిధులను మంచి వడ్డీ ఇచ్చే బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి రుణాలు, ఏఏఏ రేటింగ్ ఉన్న బాండ్లు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులుగా పెడతారట!
వెంకన్న నిధులపైనే కన్ను?
ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన లక్ష్యాల్లో మొదటిది... అన్ని కార్పొరేషన్లు, ట్రస్టులు, ఎండోమెంట్లు, యూనివర్సిటీలు, అథారిటీలు, బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర సంస్థల నుంచి నిధులు సేకరించడం! పేరుకు ఇంత పెద్ద జాబితా ఉన్నప్పటికీ... భారీగా మిగులు నిధులు ఉన్న ప్రభుత్వ సంస్థలు తక్కువ. తమ సొంత అవసరాలు తీర్చుకునేందుకే అప్పులు చేస్తున్నాయి. తిప్పలు పడుతున్నాయి. ఇక మిగిలింది... తిరుమల తిరుపతి దేవస్థానమే! కానీ... నేరుగా టీటీడీ నిధులు సేకరించాలనే ప్రతిపాదన చేస్తే వివాదాస్పదమవుతుందనే ఉద్దేశంతోనే కార్పొరేషన్లు, బోర్డులు, యూనివర్సిటీలు అంటూ ఇతర సంస్థలనూ జాబితాలో చేర్చినట్లు భావిస్తున్నారు. తిరుమల తిరుపతిలోని వెంకన్న హుండీకి రోజూ 2 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. బ్యాంకుల్లో వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. టీటీడీ పరిధిలో అనేక ట్రస్టులు కూడా ఉన్నాయి. ఒక్క నిత్యాన్నదాన ట్రస్టుకే 1300 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్లు ఉన్నాయు. వెరసి... నిధులతో పుష్కలంగా కళకళలాడుతున్న తిరుమల ఆలయ నిధులే ప్రధాన లక్ష్యంగా ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటవుతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. యూనివర్సిటీలు, వాటి పరిధిలోని సంస్థల సొమ్మును ఏపీఎ్‌సఎ్‌ఫఎ్‌సకు మళ్లించే అవకాశం కల్పించారు.
పబ్బం గడుపుకొనేందుకేనా?
టీటీడీతో సహా ఇతర సంస్థలన్నీ సొంతంగానే తమ నిధులను నిర్వహించుకుంటున్నాయి. మిగులు నిధులను ప్రభుత్వరంగ, లేదా ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నాయి. మరోవైపేమో... రోజువారీ అవసరాల కోసం సర్కారు అప్పుల కోసం అటూ ఇటూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో... ఆయా సంస్థల సొమ్మును సేకరించేందుకే ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ అనే కంపెనీని సృష్టించినట్లు భావిస్తున్నారు. ముందుగా ఆయా సంస్థల చేత ఏపీఎ్‌సఎ్‌ఫఎ్‌సలో పెట్టుబడులు పెట్టిస్తారు. వీటి నిర్వహణకోసం ‘తగినంత సమయం’ తీసుకుంటారు. ఆలోపు సొంత అవసరాలకోసం నిధులు వాడుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే... ప్రతినెలా మొదటివారంలో పడుతున్న అప్పుల తిప్పలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాదు... సొమ్ములను డిపాజిట్ చేసే పేరిట బ్యాంకులనూ దారిలోకి తెచ్చుకోవచ్చు.
ఎంత సృజనాత్మకతో...
ఆయా విభాగాల నుంచి జమ అయిన సొమ్ముతో ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ ఫండ్ మేనేజ్‌మెంట్ చేస్తుంది. ఈ కంపెనీ అద్భుతమైన, సృజనాత్మకతతో కూడిన ఆర్థిక విధానాలను అవలంబిస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఎస్‌ఎ్‌ఫఎ్‌సలో జమ అయ్యే సొమ్మును అధిక వడ్డీలకు ఇస్తామని... బిడ్డింగ్ ద్వారా ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తే, ఆ బ్యాంకులోనే డిపాజిట్ చేస్తామని చెప్పారు. వడ్డీ రూపంలో వచ్చే సొమ్ము ఎస్‌ఎ్‌ఫఎస్ ఖాతాలో జమ అవుతుంది. ఆ వడ్డీని ఆయా సంస్థలకు ఇస్తారా? లేదా? అన్నది జీఓలో పేర్కొనలేదు. భారీ లాభాలను అన్వేషించే ప్రయత్నంలో షేర్‌మార్కెట్‌లోనూ పెట్టుబడులు పెట్టనున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టి నిధులను పెంచుకోవాలన్న అంశాన్ని చేర్చారు. అవసరాన్ని బట్టి ఎస్‌ఎ్‌ఫఎ్‌సను షేర్‌మార్కెట్‌లో రిజిస్టర్ చేసి ఐపీఓకు వెళ్లాలన్న అంశాన్ని కూడా అందులో పేర్కొన్నారు.
ఎవరి సొమ్ముతో సోకులు?
నిబంధనల ప్రకారం తిరుమల వెంకన్న సొమ్ముతోపాటు, ఇతర దేవాలయాలకు భక్తులు, దాతల నుంచి వచ్చే సొమ్మును దారి మళ్లించడానికి వీల్లేదు. ‘ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్’ పేరిట ఇప్పుడు ఎ్‌సఎ్‌ఫఎ్‌సకు తరలించే అవకాశముంది. నిజానికి... టీటీడీ తన నిధులను బలమైన కార్పొరేట్ సంస్థలతో సమానంగా జాగ్రత్త చేసుకుంటుంది. టీటీడీలో అత్యున్నత అర్హతలు, అనుభవం ఉన్న ఆర్థిక నిపుణుడి పర్యవేక్షణలో ఆర్థిక నిర్వహణ జరుగుతుంది. ఆర్థిక నిర్వహణలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి... కొత్తగా ఏపీఎ్‌సఎ్‌ఫఎస్ చేయబోయే ‘ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్’ ఏమిటో? ఎలా ఉంటుందో?