శ్రీవారి కైంకర్య పర్యవేక్షకుడికి కరోనా

ABN , First Publish Date - 2020-07-19T09:24:18+05:30 IST

తిరుమల కొండపై కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా శ్రీవారి కైంకర్యాల పర్యవేక్షణలో కీలకపాత్ర పోషించే స్వామీజీ కొవిడ్‌ బారిన పడ్డారు. శుక్రవారం రాత్రి

శ్రీవారి కైంకర్య పర్యవేక్షకుడికి కరోనా

  • 30మంది శిష్యబృందానికీ పరీక్షలు 
  • టీటీడీలో 158మందికి వైరస్‌ నిర్ధారణ 
  • 18మంది అర్చకులకు పాజిటివ్‌ 
  • దర్శనాలు నిలిపివేసే యోచనలో టీటీడీ?


తిరుమల, జూలై 18(ఆంధ్రజ్యోతి): తిరుమల కొండపై కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా శ్రీవారి కైంకర్యాల పర్యవేక్షణలో కీలకపాత్ర పోషించే స్వామీజీ కొవిడ్‌ బారిన పడ్డారు. శుక్రవారం రాత్రి చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. వయసులో పెద్దవారైనందున చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించాలని తొలుత నిర్ణయించారు. అయితే చాతుర్మాస దీక్ష పూర్తయ్యేవరకు పొలిమేర (తిరుచానూరు) దాటరాదనే నిబంధన ఉన్న నేపథ్యంలో ఆయన సూచన మేరకు తిరుపతిలోని స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన శిష్యబృందం 30మంది నుంచి శాంపిల్స్‌ తీసుకున్నారు. కాగా, శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభించినప్పటి నుంచి  158 మంది టీటీడీ సిబ్బందికి కరోనా సోకింది. అర్చకుల్లో ఇప్పటికే 18మందికి పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, శ్రీవారి దర్శనాలు తిరిగి మొదలుపెట్టిన తర్వాతే టీటీడీ ఉద్యోగులతో పాటు తిరుపతి, తిరుమల స్థానికుల్లోనూ పాజిటివ్‌ కేసులు అధికమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. అర్చకులందరూ వరుసగా కరోనా బారిన పడుతుండటంతో దర్శనాల నిలుపుదలే మంచిదని టీటీడీ బోర్డు, ఉన్నతాధికారుల్లో చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. నెలాఖరు వరకు దర్శనాలు రద్దుచేసి కైంకర్యాలన్నీ ఏకాంతంగానే నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై నేడో, రేపో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


దర్శనాలపై సమీక్షిస్తాం: వైవీ సుబ్బారెడ్డి 

శ్రీవారి నిత్యకైంకర్యాల పర్యవేక్షకుల ఆరోగ్యం నిలకడగానే ఉందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వారి విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై అధికారులతో సమీక్షిస్తామన్నారు.

Updated Date - 2020-07-19T09:24:18+05:30 IST