దుర్గమ్మా... చూడమ్మా!

ABN , First Publish Date - 2020-09-16T08:57:05+05:30 IST

మొన్నటికి మొన్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇప్పుడు... తెలుగు రాష్ట్రాల్లో కోట్లమందికి కొంగు బంగారమైన బెజవాడ కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు

దుర్గమ్మా... చూడమ్మా!

  • వెండి ఉత్సవ రథం సింహాలు మాయం
  • 24 కిలోల బరువైన 3 వెండి సింహాలు చోరీ
  • కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే దొంగతనం?
  • ‘అంతర్వేది’ ఘటన నేపథ్యంలో పరిశీలన
  • చోరీ జరిగిందని తెలిసీ అధికారుల మౌనం
  • సీసీ టీవీ ఫుటేజీ కూడా పోయినట్లే!
  • పొంతనలేని మాటలు, వింత వాదనలు


(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

మొన్నటికి మొన్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇప్పుడు... తెలుగు రాష్ట్రాల్లో కోట్లమందికి కొంగు బంగారమైన బెజవాడ కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. ఒక్క సింహం విగ్రహం మాత్రమే మిగిలింది. దానిని కూడా పెకలించేందుకు ప్రయత్నించి.. విఫలమైనట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. దుర్గగుడి ప్రాంగంణంలోనే ఉన్న వెండి రథానికి ఉన్న సింహాలు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తున్నా... ఆలయ అధికారులు వాస్తవాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మాయమైన మూడు వెండి సింహాల విలువ దాదాపు 15 లక్షల రూపాయలు! కనకదుర్గ అమ్మవారిని తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజున వెండి రథంపై ఊరేగిస్తారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఈ వెండి రథా న్ని తయారు చేయించారు. విజయవాడలోని దుర్గా ఇండస్ట్రీస్‌ సంస్థ ఈ రథానికి వెండి తాపడం చేసింది. సుమారు 70 కేజీలకుపైగా వెండితో ఈ రథానికి తాపడం చేశారు. దీనికోసం అప్పట్లోనే సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేశారు. దుర్గాదేవి సింహ వాహిని! దీనిని ప్రతిబింబించేలా ఉత్సవ రథం నాలుగు స్తంభాలకు నాలుగు వెండి సింహాల విగ్రహాలను అమర్చారు. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండిని తాపడం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు 3 సింహాలు మాయమయ్యాయి. అంటే, మొత్తం 24 కేజీల వెండి చోరీకి గురైంది. 


ఎలా బయటపడింది!

అంతర్వేది రథం దహనం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై దృష్టి సారించారు. అందు లో భాగంగా సోమవారం దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివా్‌సతో సమావేశమయ్యారు. దుర్గగుడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ చర్చించారు. రథాలకు ప్రత్యేక షెడ్లను నిర్మించి పటిష్ఠ భద్రత కల్పించాలని.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్‌ సూచించారు. ఈ భేటీ తర్వాత.. ఈవో, సిబ్బంది దుర్గమ్మ రథాలను పరిశీలించారు. వెండి ఉత్సవ రథాన్ని పరిశీలించినప్పుడు విషయం బయటపడింది. రథానికి నాలుగువైపులా ఉండాల్సి న వెండి సింహాల్లో 3 అపహరణకు గురైనట్లు తేలింది. నాలు గో సింహాన్ని కూడా ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఆ సింహాన్ని బలంగా లాగడానికి ప్రయత్నించడంతో సగం వేలాడుతోంది. వెండి ఉత్సవ రథం, మరో చిన్న రథం దుర్గగుడి ఆవరణలో.. సమాచార కేంద్రానికి సమీపంలోనే(లిఫ్టుల పక్క న) ఉంటాయి. ఇక్కడ సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినప్పటికీ.. సింహాలు మాయం కావడం గమనార్హం. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే చోరీ జరిగినట్లు భావిస్తున్నా రు. కరోనా కలకలం మొదలైన నాటి నుంచి ఈ రథానికి వేసిన టార్పాలిన్‌ పట్ట ను అధికారులు తొలగించలేదు. వెండి సిం హాలను చోరీ చేసిన వ్యక్తులు పని పూర్తయ్యాక  టార్పాలిన్‌ను యథాతథంగా చుట్టేయడంతో సిబ్బందికి కూడా అనుమానం రాలేదు. సోమవారం రథానికి ఉన్న టార్పాలిన్‌ను తొలగించగా విగ్రహాల మాయం విషయం తెలిసింది. 


అయినప్పటికీ గప్‌చుప్‌!

కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన దుర్గమ్మ ఉత్సవ రథం విగ్రహాలు మాయమైనప్పటికీ... అసలేమీ జరగనట్లుగానే అధికారులు మౌనం వహించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పైగా... పొంతనలేని మాటలతో మాయ చేసేందుకు ప్రయత్నించారు. సింహాలు స్టోర్‌ రూంలో ఉండొచ్చని ఒకసారి, అంతకు ముందే పోయి ఉండొచ్చని మ రోసారి చెబుతూ వచ్చారు. ‘స్టాక్‌ రిజిస్టర్‌ పరిశీలిస్తేకానీ ఈ విషయం నిర్ధారించలేం’ అని సాక్షాత్తు ఈవో సురేశ్‌ బాబు  కూడా చెప్పారు. స్టోర్‌ రూమ్‌ను, స్టాక్‌ రిజిస్టర్‌ను పరిశీలించేందుకు గంటలు, రోజులు అక్కర్లేదు. నిమిషాల్లో తేల్చేయవచ్చు. కానీ... చోరీ విషయాన్ని నిర్ధారించేందుకు మూడు రోజుల గడువు కావాలని ఈవో పేర్కొనడం విశేషం. సింహాలు మా యమైన విషయమై మీడియా ప్రశ్నించినా అలాంటిది ఏమీ లేదని ఈవో బుకాయించారు. ‘వెండి ఉత్సవ రథం టార్పిలిన్‌ను తొలగించి చూపించండి’ అని మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ఎంతగా కోరినా ఆయన అందుకు అంగీకరించకపోవడం గమనార్హం. కాగా, సింహాల చోరీ విషయాన్ని దాచిపెట్టి... పోయిన వాటి స్థానం లో కొత్తవి పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.  ‘చో రీ జరిగిందో లేదో నిర్ధారించడానికి 3 రోజులు పడుతుంది’ అని ఈవో చేసిన ప్రకటన వెనుక అంతరార్థం ఇదేనని భావిస్తున్నారు. ఇక, కొండ కింద ఆలయ ఆవరణలోనే ఉన్న వెండి ఉత్సవ రథం వద్ద సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వెండి సింహాలు మాయం కావడం వెనుక ఇంటి దొంగల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవో పర్యవేక్షణ లోపం కూడా వెండి సింహాలు మాయం కావడానికి కారణంగా చెబుతున్నారు. ఆలయంలో సీసీ ఫుటేజి బ్యాకప్‌ కూడా నెల రోజులకు మించి ఉండదు. లాక్‌డౌన్‌ సమయంలో చోరీ జరిగి ఉంటే.. ఆ దృశ్యాలేవీ ఇప్పుడు సీసీ టీవీల్లో లభించవు.


మాయమయ్యాయని అనుకోవట్లేదు!

‘‘రథంపై ఉన్న సింహాలు మాయమయ్యాయని అనుకోవ డం లేదు. అంతర్వేది ఘటన నేపథ్యంలో వెండి సింహాలు మాయమయ్యాయని ఫేక్‌న్యూస్‌ ప్రచారంలోకి వచ్చిఉండొ చ్చు. రికార్డులు పరిశీలించకుండా సింహాలు ఉన్నదీ లేనిదీ ఎలా చెప్పగలం? నేను ఈవోగా వచ్చాక ఈరథాన్ని వినియోగించలేదు బుధవారం రథాన్ని, రికార్డులను పరిశీలించి సింహాలు గతంలో ఉన్నాయా లేవా తేల్చడానికి 3 రోజుల సమయం పడుతుంది’’

సురేశ్‌ బాబు, దుర్గగుడి ఈవోమొత్తం మూడు రథాలు

దుర్గగుడిలో 3 రథాలున్నాయి. రథం సెంటరులో పెద్ద రథం, మహా మండపం దగ్గర చిన్న చెక్క రథం, వెండి ఉత్సవ రథం ఉంటాయి. ఉగాదితోపాటు  బ్రహ్మోత్సవాల సమయంలోనూ వెండి ఉత్సవ రథంపై దుర్గమ్మను ఊరేగిస్తారు.  చైత్ర మాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఐదు రోజులపాటు రోజుకో వాహనంపై అమ్మవారు ఊరేగుతారు. ఐదో రోజున వెండి ఉత్సవ రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు.

Updated Date - 2020-09-16T08:57:05+05:30 IST