అంత పెద్ద యూపీకే ఒకటి..! ఏపీకి మూడు రాజధానులా?
ABN , First Publish Date - 2020-08-12T09:30:46+05:30 IST
దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ఆక్షేపించారు.

- ఆంధ్ర కంటే యూపీ 4 రెట్లు పెద్దది
- అయినా పాలనకు ఇబ్బందిలేదు
- అమరావతిలో చివరి రైతు వరకు న్యాయం
- వైసీపీ గూండాయిజాన్ని ఎదుర్కోవాలి
- పార్టీ శ్రేణులకు రామ్‌మాధవ్ పిలుపు
- రాష్ట్ర అధ్యక్షుడిగా వీర్రాజు బాధ్యతల స్వీకారం
అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ఆక్షేపించారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కన్నా నాలుగు రెట్లు పెద్ధదైన ఉత్తరప్రదేశ్‌కు ఒక్కటే (లఖ్‌నవూ) రాజధాని ఉందని.. అయినా అక్కడ పరిపాలనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. రాజధాని అమరావతిలో అవినీతిపై గతంలో బీజేపీ ప్రశ్నించించని.. ఇప్పుడు ట్రిపుల్ ధమాకాపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రామ్‌మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.. అంశం కోర్టు పరిధిలో ఉంది.. కేంద్రప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తన పరిధిలో వ్యవహరించింది..
ఇది రాజ్యంగాబద్ధంగా కరెక్టే.. కానీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చివరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ రాష్ట్ర శాఖ పోరాటం చేయాలి. ఒక్క రాజధానిలో అవినీతిపై పోరాడాం.. ఇప్పుడు మూడూ కలిపి ట్రిపుల్ ధమాకా కాకూండా చూడాలి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం ఇక్కడ అద్దె ఇళ్లలో ఉంటూ బస్సులో ఎలా పాలన సాగించిందో చూశాం.. రాజధాని ఏర్పాటు చేసుకుంటామంటే కేంద్రం పరిధి మేరకు సరేనన్నాం.. కానీ అవినీతిపై బీజేపీ నిలదీసింది.. ఇప్పుడూ మూడు రాజధానుల విషయంలోనూ అంతే’ అని అన్నారు. రాష్ట్రంలో తాము జూనియర్ పార్టీ అనే భావన బీజేపీ కార్యకర్తలు, నేతలు వీడనాడాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం మంచిపని చేసి అంగీకరించి.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు రోడ్డెక్కి ప్రజల తరపున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలన్నారు.
ప్రభుత్వానికి విమర్శనాత్మక మిత్రుడిగా..
రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఇప్పుడు మంచి అవకాశం ఉందని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, విమర్శనాత్మక మిత్రుడిగా బీజేపీ ఉండాలని రామ్‌మాధవ్ సూచించారు. ప్రతిపక్షాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల ఇళ్లకు పోలీసులే వెళ్లి కూర్చోవడం, ఇబ్బంది పెట్టడం ఏపీ మినహా ఎక్కడా ఎవరూ చేయడం లేదన్నారు. 2024లో జనసేనతో కలిసి అధికారంలోకి రావాలనుకున్న లక్ష్యం అంత సులభంగా నెరవేరదని, ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని తెలిపారు. సోమువీర్రాజు తన ప్రసంగంలో ఎక్కువగా మోదీ ప్రభుత్వ విజయాలే వెల్లడించారని, ఆయన భుజాలపై గన్‌పెట్టి కాల్చేలా రాష్ట్రంలో రాజకీయాలు చేయవద్ధని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమస్యలేంటో గుర్తించి ఇక్కడి ప్రజలకు మేలు జరిగేలా పోరాటం చేయాలని సూచించారు. కన్నాను అధ్యక్షుడిగా తొలగించి సోము వీర్రాజును నియమించినట్లు వస్తున్న వ్యాఖ్యలను రామ్‌మాధవ్ తోసిపుచ్చారు. ఇది బాధ్యతల అప్పగింత మాత్రమేనని, కన్నాకు మరో బాధ్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. అమిత్ షా మినహా దేశంలో బీజేపీ అధ్యక్షులందరూ ఒకసారే పనిచేశారని, పార్టీలో ప్రతి ఒక్కరూ అధ్యక్షుడిగానే భావించి బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు. కొత్త కమిటీలను త్వరగా నియమించి వీర్రాజు నేతృత్వంలో ప్రజలకు పార్టీ మరింత దగ్గరవ్వాలని ఆకాంక్షించారు.