ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2020-10-12T09:42:29+05:30 IST

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది మధ్య

ముంచెత్తిన వాన

వాయుగుండంతో అలజడి

నేడు మరింత తీవ్రంగా మారే అవకాశం

విశాఖ, నరసాపురం మధ్య తీరం దాటే చాన్స్‌

అత్యంత భారీ వర్షాల ముప్పు

విశాఖ, గోదావరి జిల్లాలకు కుంభవృష్టి!

మిగిలిన జిల్లాలకూ భారీ వానలు

తీరం వెంబడి బలమైన గాలులు

ఓడరేవుల్లో మూడో నంబరు సూచిక

జిల్లాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం

ప్రకాశంలో లోతట్టు ప్రాంతాలు జలమయం

కడపలో ఉప్పొంగిన వాగులు.. వంకలు

తుంగభద్ర 20 గేట్లు ఎత్తివేత

గోదావరి జిల్లాలకు తీవ్ర ముప్పు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 330 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 370 కిలోమీటర్లు, నరసాపురానికి తూర్పు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. గంటకు 10-12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. సోమవారం రాత్రికి విశాఖపట్నం-నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఆదివారం కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. సోమవారం కోస్తా జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలతోపా టు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. 


గోదావరి జిల్లాలకు తీవ్ర ముప్పు..

తీవ్ర వాయుగుండం ఉభయ గోదావరి జిల్లాలపై విరుచుకుపడనుందని అంచనా. దీని ప్రభావం విశాఖ, కృష్ణా జిల్లాలపైనా ఎక్కువగా, కోస్తాలోని మిగిలిన జిల్లాలపైనా కొంతమేర ఉంటుంది. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టి(200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ) వర్షాలు కురుస్తాయని, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, సోమవారం 55-65 కి.మీ., అప్పుడప్పుడు 75 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.


ఒడిసా, తమిళనాడుల్లోనూ గంటకు 50-60 కి.మీ., అప్పుడప్పుడు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మూడు రాష్ర్టాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని పేర్కొంది. కళింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. కోస్తా జిల్లాల అధికార యంత్రాంగాలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల అధికారులతో నిరంతరం సమీక్షిస్తోంది. తీర, లోత ట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు హెచ్చరించారు. కాగా ఈనెల 14న ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


పశ్చిమగోదావరి జిల్లాలోని తీర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పీఎం లంక వద్ద ఇసుక గట్టు క్రమంగా కోతకు గురవుతోంది. ప్రభుత్వ హెచ్చరికతోనూ అధికార యంత్రాగం అప్రమత్తమైంది. తీర గ్రామాల్లో పనిచేసే సిబ్బంది వాయుగుండం తీరం దాటే వరకు గ్రామాల్లోనే ఉండి ప్రజల్ని బయటకు రానివ్వకుండా అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌, తహశీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బియ్యపుతిప్ప, వేములదీవి, సర్దుగడప, పీఎం లంక గ్రామాల్లోని తుఫాను షెల్టర్లను సిద్ధం చేస్తున్నారు. చేతికందే సమయంలో పంట నీటి పాలవుతుందని రైతులూ ఆందోళన చెందుతున్నారు. 


తీరానికి చేపల బోట్లు..

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోట్లకు పశ్చిమగోదావరి జిల్లా అంతర్వేది లైట్‌హౌస్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికను తెలియజేస్తున్నారు. దీంతో చాలా బోట్లు క్షేమంగా ఒడ్డుకు చేరాయి. కొన్ని బోట్లు ఆదివారం సాయంత్రానికి నరసాపురంలో తీరానికి చేరుకున్నాయి. మరికొన్ని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద ఆగిపోయాయి. ఇంకా రావాల్సిన బోట్లు ఏమైనా ఉన్నాయా అని మత్స్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లాలో శనివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల కుండపోతగా వాన పడింది. రాచర్లలో 98, గిద్దలూరు 92, సీఎస్‌ పురంలో 87, పామూరులో 74 మిల్లీమీటర్ల  వర్షం కురిసింది. ఒంగోలులో నాలుగు గంటల వ్యవధిలోనే 81 మి.మీల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన వీధులన్నీ తటాకాలను తలపించాయి. గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, పర్చూరు, ఒంగోలు తదితర వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో పత్తి, కంది, మిర్చి, వరి పొలాల్లోకి నీరు చేరింది. పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణాజిల్లాలోనూ ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నివాస్‌ హెచ్చరికలు జారీచేశారు. 24 గంటలపాటు పనిచేసేలా 08942-240557 కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.  
కడపలో ఉప్పొంగిన వాగులు..వంకలు..

కడప జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వంకలు, వాగులు ఉప్పొంగి.. రోడ్లు, వంతెనలపై ప్రవహించాయి. చిన్నమండెం మండలంలో 135, వీరబల్లిలో 109 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలివీడు, మైదుకూరు, సిద్దవటం మండలాల్లోని పలు గ్రామాల్లో వరదనీరు చేరింది. సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామంలో చేనేత మగ్గాల గుంతల్లోకి వర్షం నీరు చేరి చేనేత కార్మికులు భారీగా నష్టపోయారు. వరి, పత్తి పంటలు నీటిపాలై లక్షల్లో నష్టం జరిగింది. భారీగా పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లాలో తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. 59,664 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఆదివారం సాయంత్రం 20 గేట్లు ఎత్తి 45 వేల క్యూసెక్కులను నదికి విడుదల చేశారు. జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయి(1633 అడుగులు)కు చేరింది. గరిష్ఠ స్థాయిలో (100.855 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Updated Date - 2020-10-12T09:42:29+05:30 IST