-
-
Home » Andhra Pradesh » Thousands of positive cases in the district
-
కృష్ణా కొంప కరోనా!
ABN , First Publish Date - 2020-06-22T08:36:04+05:30 IST
కృష్ణా జిల్లాల్లో కరోనా విజృంభించింది. జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజుకు 50పైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

- జిల్లాలో వెయ్యి పాజిటివ్ కేసులు
- యాక్టివ్ కేసులు, మరణాల్లో తొలిస్థానం
- వైరస్ గుప్పిట్లో విజయవాడ
- హైదరాబాద్ నుంచి వచ్చిన వారితో సమస్య
- కట్టలు తెంచుకున్న కొవిడ్-19..
- 2 రోజుల్లో కర్నూలును దాటేసిన కృష్ణా
- వైరస్ గుప్పిట్లో విజయవాడ నగరం
- జిల్లాలో 80% కేసులు నగరంలోనే
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాల్లో కరోనా విజృంభించింది. జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజుకు 50పైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 10 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూన్ 1 తర్వాత జిల్లాలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశారు. ఆ తర్వాత 10 రోజులకు పరిస్థితి ఫర్వాలేదనిపించింది. ఇంతలోనే పదో తారీకు నుంచి రోజు 50 కేసులకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కూడా 66 కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లా వెయ్యి కేసుల మార్క్‌ను దాటగా... యాక్టివ్ కేసుల్లో రాష్ట్రంలోనే టాప్‌కు చేరింది. జిల్లాలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
విజయవాడ నగరంలో పరిస్థితి చేయిదాటిపోయింది. జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో 80ు విజయవాడలోనే ఉన్నాయి. దీంతో అధికారులు నగరంలో 80ు ప్రాంతాన్ని(47 డివిజన్లు) కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. నగరంతో పాటు చుట్టు పక్కల పంచాయతీలను కూడా ఈ పరిధిలో చేర్చారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. పైగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోంది.
కర్నూలును దాటేసి....: మొన్నటి వరకు కరోనా విషయంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు కృష్ణా ఆ జిల్లాను దాటేసింది. ప్రస్తుతం కర్నూలులో 1,294 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 1,048 మంది కరోనా బారిన పడ్డారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... యాక్టివ్ కేసుల్లో కర్నూలును కృష్ణా జిల్లా దాటేసింది. కర్నూలులో 528 యాక్టివ్ కేసులుండగా, కృష్ణాలో 559 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో అత్యధిక యాక్టివ్ కేసులు కృష్ణాలోనే ఉన్నాయి. మరణాలలో కూడా కృష్ణా జిల్లానే మొదటి స్థానంలో ఉంది. వారం రోజుల క్రితం వరకు కర్నూలు జిల్లాలో అత్యధిక మరణాలు నమోదయ్యేవి. శనివారం రెండు జిల్లాల్లో 33 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం కృష్ణాలో ముగ్గురు మృతి చెందడంతో జిల్లాలో మరణాల సంఖ్య 36కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక మరణాలు కృష్ణా జిల్లాలోనే నమోదయ్యాయి.
అదే అతిపెద్ద సమస్య
ప్రభుత్వ పాలనంతా ఎక్కువ శాతం విజయవాడ నుంచే సాగుతోంది. సచివాలయం గుంటూరులో ఉన్నా ఎక్కువ హెచ్‌వోడీలు విజయవాడ నగర పరిధిలో ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల్లో చాలా మంది విజయవాడలోనే నివాసం ఉంటున్నారు. ఇదే నగరానికి అది పెద్ద సమస్యగా మారింది. కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది విజయవాడకు వస్తున్నారు. వచ్చే వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానికంగా వందల కేసులు వెలుగులోకి వస్తుంటే.. హైదరాబాద్ నుంచి వచ్చిన వారి వల్ల ఆ సమస్య మరింత ఎక్కువవుతోంది.