ఇలాగైతే మరో ముంబై

ABN , First Publish Date - 2020-06-21T08:44:22+05:30 IST

‘దేవుడి దయవల్ల మన రాష్ట్రంలో పదకొండు కరోనా కేసులు మాత్రమే ఉన్నాయి’... అని ముఖ్యమంత్రి జగన్‌ మొన్నటికి ..

ఇలాగైతే మరో ముంబై

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా

ప్రజల్లోనూ కనిపించని స్వీయ నియంత్రణ

కేసులు తక్కువున్నప్పుడు లాక్‌డౌన్‌ హడావుడి

వందల్లో నమోదవుతున్నప్పుడు ‘హ్యాండ్సప్‌’

రాష్ట్రంలో 20 రోజుల్లోనే 4671 కొత్త కేసులు

మొత్తంగా వంద దాటిన మరణాలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘దేవుడి దయవల్ల మన రాష్ట్రంలో పదకొండు కరోనా కేసులు మాత్రమే ఉన్నాయి’... అని ముఖ్యమంత్రి జగన్‌ మొన్నటికి మొన్నే చెప్పినట్లుంది! అంతలోనే రాష్ట్రంలో కేసుల సంఖ్య 8 వేలను దాటింది! కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య అధికారికంగానే వందను దాటింది. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు జనజీవనాన్ని కట్టడి చేశారు. లాక్‌డౌన్‌ పేరిట ‘కర్ఫ్యూ’ అమలు చేశారు. ఇప్పుడు... రోజుకు మూడు నాలుగు వందలకుపైగా కేసులు నమోదై... మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ... అన్ని చర్యలను గాలికి వదిలేశారు. అటు ప్రజల్లోనూ అత్యధికులు స్వీయనియంత్రణ, భౌతిక దూరం వంటివి పాటించడంలేదు.


ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఏపీ కూడా త్వరలోనే మహారాష్ట్ర, తమిళనాడు సరసన చేరుతుందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మే 31న రాష్ట్రంలో మొత్తం కేసులు 3,571 కాగా, అప్పటికి 64మంది మరణించారు. ఆ తర్వాత 20రోజుల్లోనే కేసులు భారీగా పెరిగిపోయాయి. 90శాతం సడలింపులు అమల్లోకి వచ్చాక జూన్‌ 1న 3,781 కేసులు ఉండగా మరణాల సంఖ్య 66. శనివారం నాటికి  8,452కేసులు నమోదయ్యాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో 4,671 కేసులు పెరిగాయి. మరణాల సంఖ్య 101కి చేరింది. ఈ నెలలో కరోనా బారినపడి 37 మంది మరణించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 28 రోజుల్లో కేసులు రెట్టింపు కాకపోతే ప్రమాదం లేదు. మరణాలు పెరగకుండా చూసుకోవాలి. కానీ రాష్ట్రంలో 20 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి. మరణాలు విపరీతంగా పెరిగాయి. దీనిబట్టి మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి

లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 750మందికి పైగా కరోనా సోకినట్లు గుర్తించారు. కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు పాటించకపోవడం, మాస్కులు, భౌతికదూరం, ఇతర జాగ్రత్తల అమలుపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం దాదాపుగా చేతులెత్తేయడం వల్లే ఈ విపత్కర పరిస్థితులు వచ్చాయని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించడం, స్వీయ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవడమే కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి.


‘మాస్కును తప్పనిసరి చేశారు. కానీ కట్టుదిట్టంగా అమలు చేయడం లేదు. భౌతిక దూరం నిబంధన కూడా అమలు కావడం లేదు. కూరగాయల మార్కెట్లు, దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో కనీస దూరం పాటించకుండా ఒకరిపై మరొకొరు పడేలా చొచ్చుకొస్తున్నారు. కరోనా భయం లేకుండా తిరుగుతున్నారు. ముందు ఈ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి. తర్వాత కరోనా కట్టడికి అవసరమైన శానిటేషన్‌, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 


హైదరాబాద్‌తో హడల్‌ 

రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులున్నాయి. చెన్నై, హైదరాబాద్‌లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోం ది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతులిస్తోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చి వెళ్లేవారిశాతం అధికంగా ఉంటోంది. సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువశాతం మంది వారాంతంలో హైదరాబాద్‌ వెళ్లి సోమవారం వస్తున్నారు.


ఇప్పటికే కరోనా బారినపడిన ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది హైదరాబాద్‌ నుంచి వచ్చినవారే ఉన్నారు. ఉద్యోగులు ఎవరూ హైదరాబాద్‌ వెళ్లొద్దని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు. కానీ చాలామంది ఉద్యోగులు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌ బాటపట్టారు. చెన్నై నుంచి కూడా వందల మంది నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వస్తున్నారు. వీరివల్ల కూడా రాష్ట్రంలో కరోనా ప్రభావం తీవ్రమవుతోంది. ఇలాంటివారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2020-06-21T08:44:22+05:30 IST