గడప దాటని గోవిందుడు!

ABN , First Publish Date - 2020-09-13T07:38:24+05:30 IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి నిరాడంబరంగా జరగనున్నాయి. మాడవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించే స్వర్ణ, మహారథోత్సవాలు సైతం రద్దయ్యాయి. బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు వెలసిన తిరుమల పుణ్యక్షేత్రానికి

గడప దాటని గోవిందుడు!

  • ఈసారి ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు 
  • తిరుమల చరిత్రలో ఇదే మొదటిసారి 
  • 9 రోజులూ ఆలయంలోనే కార్యక్రమాలు 
  • కల్యాణ మండపంలో వాహన సేవలు 
  • స్వర్ణ, మహారథోత్సవాలు సైతం రద్దు 
  • పట్టువస్త్రాల సమర్పణపై త్వరలో నిర్ణయం 


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటేనే మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, కళాబృందాల కోలాహలం, కిక్కిరిసిన భక్తుల మధ్య మాడవీధుల్లో కనుల పండువగా గోవిందుడి విహారం.... అయితే ఈసారి కరోనా వీటన్నింటికీ మంగళం పాడింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. దాంతో స్వామివారు గడప దాటకుండానే భక్తులకు దర్శనమివ్వనున్నారు. 


(తిరుమల-ఆంధ్రజ్యోతి) 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి నిరాడంబరంగా జరగనున్నాయి. మాడవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించే స్వర్ణ, మహారథోత్సవాలు సైతం రద్దయ్యాయి. బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు వెలసిన తిరుమల పుణ్యక్షేత్రానికి 2వేలఏళ్లకు పైగానే చరిత్ర ఉంది. ఎందరో రాజులు తమ విజయ పరంపరలో భాగంగా స్వామికి ఎన్నో ఉత్సవాలు నిర్వహించేవారు. తిరుమల పరిపాలన బాధ్యతలను 1843 వరకు ఎందరో మహరాజులు, ఆర్కా టు నవాబులు, ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిష్‌ అధికారులు నిర్వహించారట. అనంతరం హథీరాం మహంతులు 1933 వరకు క్షేత్రపాలన చేశారు. స్వామికి అప్పట్లో నెలకోసారి బ్రహ్మోత్సవం జరిగిన సందర్భాలున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని సమస్యల కారణంగా బ్రహ్మోత్సవాలను ఏడాదికోసారి, అధిక మాసంలో రెండుసార్లు నిర్వహిస్తున్నారు. ఎన్ని వైపరీత్యాలు తలెత్తినా వీటిని రద్దుచేయడం, ఏకాంతంగా నిర్వహించడం దాదాపుగా తిరుమల క్షేత్ర చరిత్రలో లేదు. 1998లో మాత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు రాత్రి అశ్వవాహన సేవ ప్రారంభానికి ముందు కుండపోత వర్షంతో తిరుమల చెరువును తలపించింది. దీంతో వాహనసేవ రద్దు చేయాలని అర్చకులు, ఆగమ పండితులు, అధికారులు నిర్ణయించారు. అయితే 2గంటల తర్వాత వర్షం తగ్గడంతో పాటు నీరంతా లోతట్టు ప్రాంతాలకు పోవడంతో వాహన సేవను కొనసాగించినట్లు సీనియర్‌ అర్చకులు చెబుతున్నారు. పూర్వం యుద్ధా లు, దండయాత్రలు జరిగిన రోజుల్లోనూ స్వామివారి ఊరేగింపు ఆగిన సందర్భాలు తమకు తెలిసి ఎక్కడా లేవని వివరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ శ్రీనివాసుడు తన ఉభయ దేవేరులతో కలసి మాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటిని కటాక్షిస్తునే ఉన్నారు. 


శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొంటున్నారు. ఈనెల 23న సాయంత్రం గరుడసేవ సందర్భంగా వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలను సీఎం సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలసి సీఎం జగన్‌ 24న శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం నాదనీరాజం మండపంలో నిర్వహిస్తోన్న సుందరకాండ పారాయణలో వారిరువురూ పాల్గొంటారు. అనంతరం కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులూ పాల్గొంటారు. అక్కడ నుంచి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని అల్పాహారం తర్వాత జగన్‌ తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.


ప్రత్యేక ప్రణాళిక 

కరోనా ప్రభావంతో భక్తులు, టీటీడీ ఉద్యోగులకు వైరస్‌ వ్యాపించకుండా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంటోంది. 19నుంచి 27వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలోని కల్యాణ, రంగనాయక మండపాల్లోనే నిర్వహించనున్నారు. తొలిరోజు పెద్దశేష వాహనం నుంచి చివరిరోజు అశ్వవాహనం వరకు అన్ని వాహన సేవలు కల్యాణ వేదికలోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవమూర్తులకు అలంకరణ, సల్లింపు, శాత్తుమెర, స్నపన తిరుమంజనం వంటి కార్యక్రమాలు రంగనాయక మండపంలో జరగనున్నాయి. ఇక్కడినుంచి ఉత్సవమూర్తులను తిరుచ్చిపై పక్కనే ఉన్న కల్యాణ వేదికకు ఊరేగింపుగా తీసుకువెళ్లి వాహనంపై కొలువుదీర్చుతారు. ఆలయం నుంచి వెలుపలకు తీసుకురాకుండానే సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల్లో వైదిక కార్యక్రమాలన్నీ ఆలయానికే పరిమితం చేస్తారు. స్వర్ణ, మహారథోత్సవాల ఊరేగింపులను రద్దు చేశారు. ఆయా సమయాల్లో ఆలయంలోనే సర్వభూపాల వాహనంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి హారతులు పట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాల సమర్పణ, చివరిరోజు పుష్కరిణిలో చక్రస్నానం వంటి వాటితో పాటు మరికొన్ని ముఖ్య అంశాలపై ఒకట్రొండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. 


వాహన సేవల వివరాలు... 

తేదీ ఉదయం                రాత్రి 

19 ధ్వజారోహణం పెద్దశేష వాహనం 

20 చిన్నశేష వాహనం హంస వాహనం

21 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

22 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

23 మోహినీ అవతారం గరుడ వాహనం

24 హనుమంత వాహనం సర్వభూపాల వాహనం 

(సాయత్రం) గజవాహనం

25 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

26 సర్వభూపాల వాహనం అశ్వవాహనం

27 చక్రస్నానం ధ్వజావరోహణం

24న సాయంత్రం స్వర్ణరథోత్సవం సమయంలో 

ఆలయంలో సర్వభూపాల వాహనసేవ జరగనుంది. 

26న ఉదయం మహారథోత్సవం సమయంలో ఆలయంలో సర్వభూపాల వాహన సేవ జరగనుంది. 

Updated Date - 2020-09-13T07:38:24+05:30 IST