రెంటికీ చెడ్డారు
ABN , First Publish Date - 2020-03-02T09:20:27+05:30 IST
రాష్ట్రంలో దళిత, గిరిజన, బడుగు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుండటంతో ఒకవైపు...

- ఉన్నది పోయింది.. కొత్తది ఇవ్వరు
- అసైన్డ్ సాగు, ఇళ్ల స్థలాలు కోల్పోయిన పేదలు
- ఐదు నెలల్లో ప్రభుత్వానికి చేరిన 4,761 ఎకరాలు
- ఆ మేరకు తగ్గిన ప్రైవేటు భూసేకరణ
అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దళిత, గిరిజన, బడుగు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుండటంతో ఒకవైపు జీవనోపాధిని, మరోవైపు గూడును కోల్పోయి రోడ్డునపడుతున్నారు. మరోవైపు, ప్రభుత్వం వద్ద ఉన్న భూముల కోటా భారీగా పెరిగింది. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే సర్కారు కోటాలో అదనంగా 4,761 ఎకరాల భూమి చేరింది. ఇందులో అసైన్డ్ భూమి భారీగా ఉందని అధికారవర్గాలే చెబుతున్నాయి.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం మార్గదర్శకాలు ప్రకటించిన తర్వాత రెవెన్యూశాఖ గత ఏడాది అక్టోబరు 30న మంత్రివర్గానికి ఓ నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం... ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం వద్ద ఉన్న భూమి 21,262.46 ఎకరాలు. ప్రైవేటుగా 20,,119 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని ఆ నివేదికలో స్పష్టంగా వివరించారు. ఐదు నెలల తర్వాత అంటే, ఫిబ్రవరి 25న సీఎం సమీక్ష నాటికి సీన్ రివర్స్ అయింది! ఇళ్ల స్థలాల కోసం అసైన్డ్ భూములు తీసుకోవాలని, గతంలో ఇళ్ల స్థలాలు తీసుకొని ఉండి నిర్మాణాలు చేయకుంటే వాటిని వెనక్కు తీసుకోవాలన్న ఆదేశాల అమలు తర్వాత ప్రభుత్వ ఖాతాలో భూములు భారీగా చేరాయి. ప్రభుత్వం వద్ద తాజాగా ఉన్న భూములు 26,023.42 ఎకరాలు. అంటే, ఐదు నెలల కాలం సర్కారు అదనంగా తన పద్దులో పెంచుకున్న భూములు 4,760.96 ఎకరాలు. మరోవైపు ప్రైవేటుగా సేకరించాలనుకొని తగ్గించుకున్న భూములు కేవలం 9వేల ఎకరాలే. అంటే, ప్రైవేటు సేకరణ తగ్గిపోయినకొద్దీ, ఇతర భూముల అన్వేషణ పెరిగిందన్నమాట.
భవిష్యత్తులోనూ ఇవ్వరు!
ప్రభుత్వంపై భూసేకరణ భారం వేయవద్దని ఒకవైపు చెబుతూనే, ఇళ్ల స్థలాల కోసం అవసరాన్ని బట్టి అసైన్డ్ భూ ములు తీసుకోవచ్చంటూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో పేద దళితులు, గిరిజన, బడుగువర్గాలే సమిధలవుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా భూములు కోల్పోతున్న వారికి వచ్చే విడత భూపంపిణీలో న్యాయం చేస్తామని అధికారులు చెబుతున్నా అది మిఽథ్యేనని గత అనుభవాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వీరు అసైన్డ్ లబ్ధిదారులుగా ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో వారి వద్ద సెంటు భూమి కూడా ఉండదు. పోనీ, రికార్డులు మార్చి వారి తలరాతలు మారుస్తారా? అంటే... ఇప్పటికే ఒకసారి ఇంటిస్థలం తీసుకున్న వారి కోటాలో వారి పే రు నిలిచిపోతుంది. కొత్తగా భవిష్యత్‌లోనూ ఇంటిస్థలం రాదు.
జిల్లా ఆగస్టులో ప్రభుత్వం వద్ద ఫిబ్రవరి 25 నాటికి
ఉన్న భూమి(ఎకరాల్లో) ఉన్న భూమి(ఎకరాల్లో)
శ్రీకాకుళం 724.13 1058.95
విజయనగరం 1525.88 885.9
విశాఖపట్నం 1353.36 1420.89
తూర్పుగోదావరి 1551.99 2427.21
పశ్చిమగోదావరి 2268.59 2378.01
కృష్ణా 1940.19 2004.69
గుంటూరు 1107.69 1601.59
ప్రకాశం 992.41 1963.08
నెల్లూరు 2305.03 2728.61
చిత్తూరు 1334.69 2068.29
కడప 2447.04 2306.81
అనంతపురం 1397.25 2279.89
కర్నూలు 2314.21 2899.5
మొత్తం 21,262.46 26,023.42