‘పది’ మోడల్ పేపర్లు ఇవే
ABN , First Publish Date - 2020-05-17T10:55:13+05:30 IST
పదో తరగతి తెలుగు, హిందీ మోడల్ ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం శనివారం విడుదల చేసింది.

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): పదో తరగతి తెలుగు, హిందీ మోడల్ ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం శనివారం విడుదల చేసింది. తెలుగులో గతంలో 50 మార్కులకు ఉండే ప్రశ్న పత్రాలను 100 మార్కులకు మార్చినందున మోడల్ ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. మొత్తం 100 మార్కులకు విభజన ఎలా ఉంటుందో వివరించింది. హిందీ విషయానికి వస్తే గతంలోనూ, ఇప్పుడు కూడా 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. కానీ, కొన్ని అంశాలను మార్పు చేశారు.
తెలుగు మోడల్ ప్రశ్నపత్రం ఇలా
ఈ ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. మొత్తం 33 ప్రశ్నలు ఇస్తారు. ఒకటో విభాగంలో అవగాహన-ప్రతి స్పందనపై 32 మార్కులకు 4 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు. రెండో విభాగంలో వ్యక్తీకరణ-సృజనాత్మకతపై 36 మార్కులకు 6 ప్రశ్నలు ఉంటాయి. 3 ప్రశ్నలకు 4 మార్కుల చొప్పున, 3 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున కేటాయించారు. మూడో విభాగంలో భాషాంశాలపై 32 మార్కులకు 23 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో లక్ష్యాత్మక, అతి లఘు ప్రశ్నలు ఉంటాయి.
హిందీ మోడల్ ప్రశ్నపత్రం ఇలా
ఈ ప్రశ్నపత్రంలో 6 సెక్షన్లు ఉంటాయి. 4 అంశాలపై మొత్తం 30 ప్రశ్న లు ఇస్తారు. మొత్తం 100 మార్కులు కేటాయించారు. అంశాల వారీగా 15 మార్కులు, 52 మార్కులు, 17 మార్కులు, 16 మార్కులు కేటాయించారు.