వెండి రథం సింహాలు మాయంపై దర్యాప్తు వేగవంతం
ABN , First Publish Date - 2020-09-18T22:32:59+05:30 IST
వెండి రథం సింహాలు మాయంపై దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీఎస్, స్పెషల్ టీం పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. రథానికి మెరుగు పెట్టేందుకు రూ.47 వేలకు.

అమరావతి: వెండి రథం సింహాలు మాయంపై దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీఎస్, స్పెషల్ టీం పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. రథానికి మెరుగు పెట్టేందుకు రూ.47 వేలకు.. శ్రీశార్వాణి ఇండస్ట్రీస్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఉగాదికి 15 రోజుల ముందు రథాన్ని కాంట్రాక్టర్ వెంకట్ చూసినట్లు పోలీసులు చెబుతున్నారు. దేవస్థానానికి చెందిన అప్రైజర్ షమీ, స్తపతి షణ్ముకం, ఏఈవో ఎన్.రమేశ్‌ల నుంచి రథం వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో కాంట్రాక్టర్ వెంకట్ స్టేట్మెంట్ కీలకం కానుంది. వెంకట్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
అమ్మవారి వెండి రథంపై సింహం విగ్రహాల చోరీ వెనుక ఇంటి దొంగల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని కాపాడేందుకే దేవస్థానం ఉన్నతాధికారులు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గుట్టుగా ఉంచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఉగాదికి శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగించిన అనంతరం వెండి రథాన్ని మహామండపం కింద షెడ్డులో భద్రపరిచారని చెబుతున్నారు. అప్పటికి రథంపై సింహం విగ్రహాలున్నాయి. ఆ తర్వాత రథాన్ని కొన్నాళ్లు జమ్మిదొడ్డిలోనూ, అక్కడి నుంచి మళ్లీ కొండపైకి తీసుకువెళ్లి మహామండపం ముందు ఉంచారు. ఈ ఏడాది ఉగాదికి కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అమ్మవారిని వెండి రథంపై ఊరేగించలేదు.