ఇచ్చిన మాట మరవం

ABN , First Publish Date - 2020-12-10T08:13:58+05:30 IST

ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి మరచిపోవడం తమ విధానం కాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. చెప్పిన

ఇచ్చిన మాట మరవం

మాట ప్రకారమే ‘అనంత’ జలాశయాలు

గతంలో 804 కోట్లతో ఎగువ పెన్నార్‌

ఇప్పుడవే నిధులతో మరో 2 రిజర్వాయర్లు

సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

వర్చువల్‌గాశంకుస్థాపన


అమరావతి/ధర్మవరం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి మరచిపోవడం తమ విధానం కాదని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. చెప్పిన మాట ప్రకారం జలాశయాలను నిర్మించి గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంలో రూ.804 కోట్లతో నిర్మించతలపెట్టిన మూడు జలాశయాలకు బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో సీఎం శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి జగన్‌ మాట్లాడారు. దేవరకొండ, తోపుదుర్తి, ముట్టాల ప్రాజెక్టులతో జిల్లా రైతులకు మేలు చేయబోతున్నామన్నారు. 2018లో గత ప్రభుత్వం అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు నిర్మాణానికి జీవో తీసుకొచ్చిందే గానీ.. పనులు చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వం అవే నిధులతో అప్పర్‌ పెన్నార్‌తో పాటు మరో రెండు ప్రాజెక్టులను నిర్మించబోతోందని చెప్పారు. ఏ రకంగా లంచాలు కట్టడి చేస్తున్నామో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టులతో 75 వేల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరు అందిస్తామన్నారు.


అనంత వాసులకు సాగునీరు అందిస్తే.. వారి ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తథ్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 5,171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. నాడు-నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేసి ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చామన్నారు. రైతు భరోసా, చేనేత, అమ్మఒడి, వైఎ్‌సఆర్‌ ఆసరాలను ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో జనతా బజార్లు కూడా తీసుకొస్తున్నామని తెలిపారు. దేవుడి దయతో అనంతపురంలో పరిస్థితులు మారుతున్నాయని.. జిల్లాలో జలాశయాలన్నీ నీళ్లతో నిండి ఉన్నాయన్నారు.


కాగా.. పరిటాల రవీంద్ర అప్పర్‌ పెన్నార్‌ రిజర్వాయరుకు వైఎ్‌సఆర్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా పేరుమార్చారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకటాంపల్లిలో ఏర్పాటు చేసిన పైలాన్‌ వద్ద ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు మాలగుండ్ల శంకరనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్‌, గోపాలరెడ్డి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-10T08:13:58+05:30 IST