‘రాష్ట్రంలో సంక్షేం పూర్తిగా అమలు జరగలేదు’

ABN , First Publish Date - 2020-06-16T22:42:17+05:30 IST

రాష్ట్రంలో సంక్షేమానికి, నవరత్నాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని..

‘రాష్ట్రంలో సంక్షేం పూర్తిగా అమలు జరగలేదు’

అమరావతి: రాష్ట్రంలో సంక్షేమానికి, నవరత్నాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని.. అయితే సంక్షేమం సంపూర్ణంగా అమలు జరగలేదన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని ఏపీ సీపీఎం నేత బాబూరావు అన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ పేదలకు వచ్చే ఏడాదిలో 6 లక్షలు ఇళ్లు కేటాయించారని, కానీ బడ్జెట్‌లో రూ. 6వేల కోట్లు కేటాయించారని, ఈ లెక్కన ఒక్కో ఇంటికి రూ. లక్ష వస్తుందని, మరి లక్షతో ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక మందగమనం ఉంటుందని ప్రభుత్వమే చెబుతోందని, దానికి పరిష్కారం కూడా ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే కరోనా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అవసరమని, ఇది కూడా ఒక ముఖ్యమైన విషయంగా ప్రభుత్వం చూడాలన్నారు.


మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే.. మైనస్‌లోకి వెళ్లినట్లుగా కనపడుతోందని బాబూరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెవెన్యూలోటు 26వేల కోట్లకు పెరిగిందన్నారు. ఆర్థికలోటు కూడా పెరిగిందని, ఈ విషయం ప్రభుత్వమే చెప్పిందని, ఆ లోటును ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదన్నారు. రాష్ట్రంలో సంక్షేమం జరిగితే రైతుల ఆత్మహత్యలు ఎందుకు జురుగుతున్నాయని బాబూరావు ప్రశ్నించారు. 


Updated Date - 2020-06-16T22:42:17+05:30 IST