పశువైద్యాధికారి కాళ్లపై పాడిరైతు

ABN , First Publish Date - 2020-05-17T09:59:58+05:30 IST

పాడి ఆవును కోల్పోయిన బాధలో ఉన్న రైతుపై పశువైద్యాధికారిణి మానవత్వం మరిచి ప్రవర్తించారు.

పశువైద్యాధికారి కాళ్లపై పాడిరైతు

తన నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసిన రైతుకు బెదిరింపులు


చిత్తూరు వ్యవసాయం, మే 16: పాడి ఆవును కోల్పోయిన బాధలో ఉన్న రైతుపై పశువైద్యాధికారిణి మానవత్వం మరిచి ప్రవర్తించారు. తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్న అక్కసుతో.. రైతు దంపతులను బెదిరించి కాళ్లమీద పడేలా చేసి క్షమాపణ చెప్పించుకున్నారు. బాధితుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కృష్ణంపల్లె పంచాయతీ పరిధిలోని ఎర్రచేనుకు చెందిన శంకరాచారి పాడిఆవు శుక్రవారం చనిపోయింది. ఈ విషయాన్ని పశువైద్యాధికారిణి సుజితకు తెలిపి పోస్టుమార్టం చేసేందుకు రావాలని కోరారు. సాయంత్రం వరకు ఆమె రాకపోవడంతో పశుసంవర్ధక శాఖ ఏడీ, డీడీ, జేడీలకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.


ఉన్నతాధికారులు డాక్టర్‌ సుజితను అప్రమత్తం చేసి.. పాడి ఆవుకు పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు. దీన్ని అవమానంగా భావించిన ఆమె గ్రామానికి వెళ్లి పంచాయితీ పెట్టారు. తనకు ఇదొక్కటే పనికాదని, రోజువారీ పనులను  పక్కనబెట్టి పోస్టుమార్టం చేయడానికి రావాలని ఫోన్‌లో ఒత్తిడి చేయడం కరెక్టు కాదన్నారు. తన విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ రైతును బెదిరించే ప్రయత్నం చేశారు. తనకు క్షమాపణ చెప్పేవరకు ఆవుకు పోస్టుమార్టం చేసేది లేదంటూ మొండికేశారు. చేసేది లేక బాధిత రైతు శంకరాచారి దంపతులు గ్రామస్థులంతా చూస్తుండగానే డాక్టర్‌ సుజిత కాళ్లకు మొక్కి క్షమాపణ చెప్పారు. 

Updated Date - 2020-05-17T09:59:58+05:30 IST