రానున్న జీవీఎంసీ ఎన్నికలు.. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు
ABN , First Publish Date - 2020-06-16T16:15:10+05:30 IST
రానున్న జీవీఎంసీ ఎన్నికలు.. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు

విశాఖ సాగరతీరంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేయబోతున్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఊహించని సమస్య వారిని కంగారెత్తిస్తోంది. ఇంతకీ వారికొచ్చిన ఇబ్బంది ఏంటి? వారెందుకు వర్రీ అవుతున్నారు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
విశాఖ తీరంలో జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడో జరిగిపోయి ఉండాల్సింది. కరోనా విజృంభణతో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో విశాఖ కార్పొరేషన్ కోటలో కొలువుదీరాలని ఆశపడిన నాయకులు కొంత నిరాశచెందిన మాట వాస్తవం.
జీవీఎంసీ ఎన్నికల కోసం నేతలు ఎప్పటినుంచో కాచుకుని ఉన్నారు. ఆ మధ్య మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఒక్కసారిగా సందడి నెలకొన్నది. సీట్ల సర్దుబాటులో "నువ్వా- నేనా'' అన్నట్టుగా కుమ్ములాటలు కొనసాగాయి. రెండువైపులా రెబల్ అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. నామినేషన్ల విత్‌డ్రా సమయానికి ముందు.. ఒక్కసారిగా కరోనా ప్రమాద ఘంటికలు మోగాయి. దీంతో నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ఈ తరుణంలో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ సర్కారు కోర్టుకి వెళ్లడం, అక్కడ భంగపాటు ఎదురుకావడం వంటి విషయాలు తెలిసినవే. ఎస్‌ఈసీకి, ప్రభుత్వానికి మధ్య సాగుతున్న పోరు ప్రస్తుతం సుప్రీకోర్టు పరిధిలో ఉంది. అది వేరే సంగతి!
ఇప్పుడు మళ్లీ విశాఖతీరంలోకి వచ్చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకి ముందు జీవీఎంసీ పరిధిలో అధికార, ప్రతిపక్షాలు ఖరారుచేసిన కార్పొరేటర్ అభ్యర్థులు తమ ప్రచారాలను మొదలుపెట్టారు. ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికల వాయిదాపడ్డాయి. అయినా కార్పొరేటర్ అభ్యర్థులు తమలోతాము సర్థుకున్నారు. ఎప్పటికైనా ఈ ఎన్నికలు జరగక తప్పదు కదా- అప్పుడు చూసుకుందాంలే అని సరిపెట్టుకున్నారు.
అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ చోటుచేసుకుంది. లాక్‌డౌన్ అనేది ఎన్నాళ్లు కొనసాగుతుందో ఎవరి ఊహకీ అందలేదు. తొలిదశ గడువుతో ఆ సమస్య తీరిపోతుందని అత్యధికులు భావించారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ని కూడా సానుకూలంగా మార్చుకుందామని అధికార వైసీపీ అభ్యర్థులు ఆరాటపడ్డారు. తమ పరిధిలోని పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, పళ్లు- కూరగాయల పంపిణీ వంటివి చేపట్టారు. ఇక్కడ ఆరోగ్య భద్రత, సామాజిక దూరం పాటించడం వంటివి ఏమాత్రం పాటించలేదు. నగరంలోని వైసీపీ అభ్యర్థులు చేపట్టిన ఈ తంతు చూసి.. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులకు కూడా తెరపైకి వచ్చారు. తాము కూడా ఏమాత్రం తగ్గకుండా సరుకుల పంపిణీని చేపట్టారు. ఇక్కడే అందరికీ ఓ చిక్కొచ్చిపడింది. లాక్‌డౌన్‌ని కేంద్రప్రభుత్వం దఫదఫాలుగా పొడిగిస్తూ పోయింది. దీంతో విశాఖనగరంలోని కొన్ని ప్రాంతాల్లో కార్పొరేటర్ అభ్యర్ధులు రెండుసార్లు రేషన్ పంపిణీ చేశారు. అయితే స్థానిక పేదలు అంతటితో సంతృప్తి చెందలేదు. "మళ్లీ రేషన్ ఎప్పుడు పంచుతారు బాబు?'' అంటూ కనిపించిన ప్రతి నేతనీ అడగటం మొదలుపెట్టారట. తమ అభ్యర్థనపై ఆయా నేతలు సానుకూలంగా స్పందించకపోతే.. "ముందున్న ఎన్నికలను'' గుర్తుచేస్తున్నారట!!
ఇప్పటికే ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బులో సగానికి పైగా చాలామంది కార్పొరేటర్ అభ్యర్థులు ఖర్చుచేశారట. ఇప్పుడేమో బయటికి వెళితే సాయం కోసం జనాలు చుట్టుముడుతున్నారట. దీంతో.. పలువురు అభ్యర్థులు గడప దాటడానికి జంకుతున్నారు. ఇదిలా ఉంటే జీవీఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో సందిగ్ధత కూడా కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉంది. ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత ఎన్నికల విధానం కొనసాగుతుందా? లేక "అదంతా తూచ్..'' అని మళ్లీ కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇస్తారా? అసలు ఈసారైనా జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న పలు సందేహాలు నాయకులను వెంటాడుతున్నాయి. త్వరలో గనుక జీవీఎంసీ ఎన్నికలు జరగకపోతే.. ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేమని పలువురు నేతలు చెబుతున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో!