ఆలయ పునరుత్థానం!

ABN , First Publish Date - 2020-06-18T10:19:54+05:30 IST

అది మూడు వందల ఏళ్ల కిందట నిర్మితమైన ఆలయం. 75 సంవత్సరాల కిందట పెన్నా నదికి వచ్చిన వరదల్లో మునిగి... ఇసుక మేట వేసి పూర్తిగా

ఆలయ పునరుత్థానం!

  • 300 ఏళ్ల కిందట నిర్మాణం
  • 75 ఏళ్ల కిందట పెన్నా వరదల్లో మునక
  • చేయిచేయి కలిపి వెలికి తీసిన స్థానికులు
  • పెన్నా నది ఇసుక మేటల్లో బయటపడిన  నాగేశ్వరాలయ గోపురం

చేజర్ల, జూన్‌ 17: అది మూడు వందల ఏళ్ల కిందట నిర్మితమైన ఆలయం. 75 సంవత్సరాల కిందట పెన్నా నదికి వచ్చిన వరదల్లో మునిగి... ఇసుక మేట వేసి పూర్తిగా కనుమరుగైంది. ఈ ఆలయాన్ని తిరిగి వెలుగులోకి తేవాలని గ్రామస్థులు సంకల్పించారు. చేయీ చేయీ కలిపారు. చివరికి... ఆలయ ఆనుపానులను గుర్తించారు. ఇది... నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామస్థులు సాధించిన విజయం. పెరుమాళ్లపాడు సమీపంలో... పెన్నా తీరంలో 300 ఏళ్ల క్రితం నాగేశ్వర, శ్యామలాంబ ఆలయాన్ని నిర్మించారు. నిత్య పూజలతో ఈ ఆలయం కళకళలాడేది. 75 ఏళ్ల కిందట వచ్చిన పెన్నా వరదల్లో ఈ గుడి పూర్తిగా ఇసుక మేటలో కూరుకుపోయింది. ఆలయ పునరుద్ధరణ కోసం అప్పట్లోనే కొందరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎక్కువ మంది బయట ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిపోయారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పెరుమాళ్లపాడుకు చెందిన అనేక మంది స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ‘ఇప్పుడైనా నాగేశ్వరాలయాన్ని పునరుద్ధరించాలి’ అని తీర్మానించుకున్నారు.


గ్రామ పెద్దలు, యువకులు కలిసి దేవదాయ శాఖ అనుమతి తీసుకున్నారు. చందాలు వేసుకుని మూడు రోజుల కిందట పనులు ప్రారంభించారు. ఆలయం ఉన్న పరిసరాల్లో యంత్రాలతో అన్వేషణ మొదలుపెట్టారు. ఇసుకను తవ్విపోస్తుండగా... ఒకచోట 20 అడుగుల లోతున ఆలయ గాలి గోపురం బయట పడింది. దీంతో గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరో 20 అడుగుల వరకు ఇసుక మేటలు తొలగిస్తే ఆలయం పూర్తిగా బయటపడుతుందని స్థానికులు తెలిపారు.


పెన్నానది ఒడ్డున ఒయటపడిన  నాగేశ్వరాలయాన్ని బుధవారం పురావస్తు శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి, మంత్రి గౌతమ్‌రెడ్డి ఓఎ్‌సడీ చెన్నయ్య, దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానంద భారతి, రత్నం విద్యా సంస్థల అధినేత కేవీ రత్నం తదితరులు పరిశీలించారు. 

Updated Date - 2020-06-18T10:19:54+05:30 IST