2వేలకు చేరువలో

ABN , First Publish Date - 2020-05-11T09:19:03+05:30 IST

కరోనా దూకుడుకు బ్రేక్‌ పడటం లేదు. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 50 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1980కి పెరిగింది. మార్చి 12న తొలికేసు నెల్లూరు జిల్లాలో

2వేలకు  చేరువలో

  • రాష్ట్రంలో మరో 50 కరోనా కేసులు 
  • మొత్తం 1980కి చేరిన పాజిటివ్‌లు 
  • వంద మార్కు దాటేసిన చిత్తూరు 
  • కర్నూలు జిల్లాలో మరొకరి మృతి 
  • 45కు పెరిగిన కరోనా మరణాలు 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కరోనా దూకుడుకు బ్రేక్‌ పడటం లేదు. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 50 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1980కి పెరిగింది. మార్చి 12న తొలికేసు నెల్లూరు జిల్లాలో గుర్తించగా ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు 2వేలకు చేరువయ్యాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16కేసులు వెలుగు చూశాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల తర్వాత వంద మార్కును దాటేసిన జిల్లాల జాబితాలో చిత్తూరు కూడా చేరిపోయింది. ఈ జిల్లాలో మరో ముగ్గురికి వైరస్‌ సోకింది. వి.కోట మండలంలో ఇద్దరు డ్రైవర్లకు, శ్రీకాళహస్తిలో గుంటూరు నుంచి వచ్చినట్టు భావిస్తున్న యువకుడికి వ్యాధి సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మూడు కేసులను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఈ జిల్లాలో శనివారం నిర్ధారణ అయిన 16 కేసులను ఆదివారం బులెటిన్‌లో ప్రకటించారు. కర్నూలు జిల్లాలో మరో 13మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటిలో కర్నూలు నగరంలో 11, నంద్యాల, ఆదోనిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వీటితో కలిపి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 566కు చేరింది.


గుంటూరు జిల్లాలో మరో ఆరు కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో మరో 5కేసులు నమోదయ్యాయి. కదిరి, విడపనకల్లు, ధర్మవరంలలో నాలుగు గుర్తించగా, మరొకరు జార్ఖండ్‌ రాష్ర్టానికి చెందిన వ్యక్తి. కృష్ణాజిల్లాలో తాజాగా ఒకే పాజిటివ్‌ కేసు నమోవగా, ప్రకాశం జిల్లాలో మరో 2 కేసులు వెలుగు చూశాయి. ఒంగోలులో ఓ మహిళా వలంటీర్‌ తండ్రికి కొద్దిరోజుల క్రితమే పాజిటివ్‌ రావటంతో రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు కూడా కరోనా సోకినట్లు తేలింది. నెల్లూరు జిల్లాలో మరో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. విజయవాడ నగరం మాచవరానికి చెందిన మహిళకు పాజిటివ్‌ వచ్చింది. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఒకరికి వైరస్‌ నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో మరో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వీటిలో ఒకదాన్ని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. మరో రెండింటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 


925మంది డిశ్చార్జి 

కరోనా చికిత్స పొందుతున్నవారిలో ఆదివారం 38మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 925కి చేరింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలానికి చెందిన ఇద్దరు కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలో కరోనా చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 45కు చేరుకున్నాయి. 


‘కోయంబేడు’తో జాగ్రత్త: ఆరోగ్యశాఖ 

తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లే వర్తకులు, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వాడాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఆదివారం చిత్తూరు జిల్లాలో నమోదైన 16కేసులు కోయంబేడు లింకుతోనే నమోదయ్యాయని గుర్తించినట్లు పేర్కొంది. అలాగే కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ 3 జిల్లాల్లో కోయంబేడు మూలాలతో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.


నరసరావుపేటలో కేంద్ర కమిటీ పర్యటన 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర కమిటీ సభ్యులు ఆదివారం పరిశీలించారు. ఈ బృందంలో ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాబీ పాల్‌, పబ్లిక్‌ హెల్త్‌ స్పెషలిస్టు డాక్టర్‌ నందిని భట్టాచార్య తదితరులు ఉన్నారు. మేజర్‌ హాట్‌స్పాట్‌ వరవకట్టను, ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్షల కేంద్రాన్ని, క్వారంటైన్‌ కేంద్రాన్ని బృంద సభ్యులు సందర్శించి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కరోనా నియంత్రణ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-05-11T09:19:03+05:30 IST