నిశ్శబ్ద నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2020-05-08T09:46:55+05:30 IST

చాన్నాళ్ల తర్వాత వాడకుండా వదిలేసిన బైకునో, కారునో తిరిగి కదిలించాలంటేనే... అనేక జాగ్రత్తలు తీసుకుంటాం! ..

నిశ్శబ్ద నిర్లక్ష్యం!

గ్యాస్‌ లీక్‌ తర్వాతా మోగని సైరన్‌

లీకేజ్‌ గుర్తించినా చర్చల్లోనే నిమగ్నం

అందుబాటులో లేని నిపుణులు

కనిపించని ‘కంట్రోల్‌ రూమ్‌’

ఉష్ణోగ్రతలు పెరగడమే లీక్‌కు కారణం

లాక్‌డౌన్‌ సమయంలో నిర్వహణ లోపం

పునఃప్రారంభ సన్నాహాల్లోనే ప్రమాదం


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): చాన్నాళ్ల తర్వాత వాడకుండా వదిలేసిన బైకునో, కారునో తిరిగి కదిలించాలంటేనే... అనేక జాగ్రత్తలు తీసుకుంటాం! టైర్లలో గాలి ఉందా, బ్రేకులు పడుతున్నాయా, క్లచ్‌ బాగానే ఉందా... ఇలా ఎన్నెన్నో చూస్తాం! మరి.... 250 ఎకరాల్లో విస్తరించిన, అనేక సంక్లిష్టమైన విభాగాలున్న భారీ పరిశ్రమ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? మరి... విశాఖను కుదిపేసిన ఎల్జీ పాలిమర్స్‌ అలాంటి జాగ్రత్తలు తీసుకుందా? ఒక్కసారి చూద్దాం!


దేశంలోని అన్ని పరిశ్రమల్లాగానే... కరోనా లాక్‌డౌన్‌తో ఎల్జీ పాలిమర్స్‌ను కూడా మూసివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో... దీనిని తిరిగి తెరిచేందుకు బుధవారం సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే... దీనికి సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదు. పాలిస్టిరీన్‌ తయారీకి కీలకమైన ముడిసరుకు స్టైరిన్‌ మోనోమోర్‌. ఇది ద్రవరూపంలో ఉండే రసాయనం. ఉష్ణోగ్రత పెరిగితే ఆవిరిలా మారి వాతావరణంలో కలుస్తుంది. దీనిని ఎల్జీ పాలిమర్స్‌లో రెండు ట్యాంకుల్లో  నిల్వ చేస్తున్నారు. ఒకదానిలో 2,500 కిలోలీటర్లు, మరొక దానిలో 3,000 కిలోలీటర్లు నిల్వ చేయవచ్చు.  బుధవారం నాటికి దాదాపు 1800 టన్నుల స్టైరిన్‌ ఉన్నట్లు సమాచారం. స్టోరేజీ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటొద్దు.  మధ్యనే ఉండాలి. ఉష్ణోగ్రత పెరగకుండా ట్యాంకులను రిఫ్రిజిరేషన్‌ యూనిట్లతో అనుసంధానించి... టీబీసీ అనే కెమికల్‌ను ట్యాంకులోకి పంపడం వంటివి చేస్తుంటారు. కర్మాగారంలో ఇదో నిరంతరం తీసుకోవాల్సిన జాగ్రత్త. 


కానీ... ఏం చేశారు?

సాధారణంగా ఉత్పత్తి సమయంలో ప్రమాదాల తీవ్రత తక్కువగానే ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఉత్పత్తి నిలిపివేయడంతో నిర్దిష్ట ఉష్ణోగ్రత నిర్వహణపై కొంత నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిఫ్రిజిరేషన్‌ యూనిట్‌లో లోపంతో... ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరగడంతో సెకండరీ గ్యాసెస్‌ తయారై, స్టోరేజీ ట్యాంకులో ఒత్తిడి పెరిగి... వాల్వుల ద్వారా గ్యాస్‌ లీకైనట్లు చెబుతున్నారు. నిజానికి... రసాయనాల స్టోరేజీ ట్యాంకుల రక్షణ బాధ్యతను నిరంతరంకంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించాలి. గ్యాస్‌ లీకైన సమయంలో సత్వర చర్యలు తీసుకోవాల్సిన నిపుణులూ ఉండాలి. అర్ధరాత్రి 1 గంట సమయంలో స్టైరిన్‌ గ్యాస్‌ లీక్‌ కావడం మొదలైంది. 2 గంటల సమయంలో ఘాటైన వాసనలు రావడంతో అక్కడి సిబ్బంది ప్రమాదాన్ని పసిగట్టారు. కాసేపు వారిలో వారు చర్చించుకున్నారు. సుమారు గంట తర్వాత పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌కు, ఆ తర్వాత కలెక్టర్‌కు, పోలీసు కమిషనర్‌కు సమాచారం వెళ్లింది. అప్పటికి సమయం దాదాపు 4 గంటలు. అప్పటిదాకా విష వాయువు మెల్లగా విస్తరిస్తూనే ఉంది. గాఢమైన నిద్రలో ఉన్న స్థానికులు... దానిని పీలుస్తూనే ఉన్నారు.


సైరస్‌ మోగించలేదు...

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా రోజూ సైరన్‌ మోగిస్తుంది. ఇది కార్మికులకు ఇచ్చే పిలుపు. అయితే, ప్రమాదాలు జరిగినప్పుడు మరోరకం సైరన్‌ మోగించాలి. భీకరమైన శబ్దంతో మోగే ఈ ప్రత్యేక సైరన్‌ను వినగానే ప్రమాదమేదో జరిగిందని స్థానికులకు తెలుస్తుంది. ఈ సైరన్‌ ఉన్నప్పటికీ... సిబ్బంది దానిని పట్టించుకోలేదు. తమలో తాము చర్చించుకుంటూ కాలం గడిపి, ప్రమాదం పసిగట్టిన తర్వాత కూడా సైరన్‌ మోగించకుండా పోలీసులకు సమాచారమిచ్చి వదిలేశారు. ఇది పెను ప్రమాదానికి కారణమైంది.


యంత్రాంగం ఏం చేస్తోంది!

విశాఖ నగరంలో, చుట్టుపక్కల అనేక భారీ కర్మాగారాలున్నాయి. వీటిలో చాలా వరకు లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. ఈ సమయంలో ఆయా కంపెనీల్లో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. కానీ... ఎల్జీ పాలిమర్స్‌  ప్రముఖ కంపెనీ కావడంతో, అక్కడేం జరుగుతోందో కాలుష్య నియంత్రణమండలి, ఫ్యాక్టరీస్‌ విభాగం, పరిశ్రమల శాఖ పెద్దగా పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని రకాల నిర్లక్ష్యాలే... విశాఖలో కలకలానికి కారణమయ్యాయని చెబుతున్నారు. 


‘విరుగుడు’కు కొరత

ప్రమాదవశాత్తూ విష రసాయనాలు విడుదలైతే దీనికి విరుగుడుగా చల్లే పీటీబీసీ రసాయనం ఎల్జీ పాలిమర్స్‌లో 1500 కిలోలు మాత్రమే నిల్వ ఉన్నట్లు సమాచారం. 40 రోజుల నుంచి కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడం, ఇతర ప్రాంతాల నుంచి రవాణా కార్యకలాపాలు స్తంభించడంతో విరుగుడు రసాయనాల నిల్వలపై కంపెనీ దృష్టి సారించలేదు. ఉత్పత్తిలేదు కాబట్టి ఉన్న 1,500 కిలోలు సరిపోతుందని భావించారు. ప్రమాదం సంభవించిన వెంటనే కంపెనీ ప్రతినిధులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మూడు గంటల్లో సుమారు 800 కిలోల విరుగుడు రసాయనాన్ని వినియోగించారు. తరువాత కొద్ది కొద్దిగా రసాయనాన్ని ట్యాంకు పరిసరాల్లో చల్లుతూ వచ్చారు. మొత్తంగా రసాయనం అయిపోయింది. దీంతో... మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్యాస్‌ తీవ్రత విడతల వారీగా కొనసాగింది. గురువారం రాత్రి కూడా గ్యాస్‌ వాసన వచ్చినట్లు పెందుర్తి పరిసరాలకు చెందిన పలువురు చెప్పారు.


ఏమిటీ ఫ్యాక్టరీ... 

ఎల్‌జీ... లైఫ్‌ ఈజ్‌ గుడ్‌! ఈ కంపెనీ నినాదం. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టీవీల వంటి ఉపకరణాల తయారీకి ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా సంస్థ ఇది. గోపాలపట్నం మండలం ఆర్‌ఆర్‌ వెంకటాపురం ప్రాంతంలో తొలుత హిందూస్థాన్‌ పాలిమర్స్‌ పేరుతో ఏర్పాటైంది. 1969లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇక్కడ మొలాసి్‌సను తయారు చేసేవారు. ఆ తర్వాత దీనిని విజయమాల్యా టేకోవర్‌ చేసి మెక్‌డోవల్‌ కంపెనీ ఏర్పాటుచేశారు. మొలాసిస్‌ తయారీతో కాలుష్యం భారీగా పెరగడంతో ప్రజలు భారీ ఆందోళన చేశారు. ప్రభుత్వం దీనిని మూసి వేయించింది. ప్రపంచీకరణ మొదలైన తర్వాత... 1997లో దీనిని దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ కెమికల్స్‌ స్వాఽధీనం చేసుకుంది. సుమారు 250 ఎకరాల్లో ఎల్జీ పాలిమర్స్‌ విస్తరించి ఉంది. ఇక్కడ ఫ్రిజ్‌లు, ఏసీలకు అవసరమైన ప్లాస్టిక్‌, థర్మోకోల్‌ షీట్లు, ఇతర ఇంజనీరింగ్‌ పరికరాలు తయారు చేస్తున్నారు. పాలిస్టీరియన్‌, పాలిస్టీరియన్‌ ఎక్స్‌పాండబుల్స్‌ కోసం స్టైరిన్‌ మోనోమోర్‌ ఉపయోగిస్తారు.


గతంలో దీనిని కూడా ఇక్కడే ఉత్పత్తి చేసేవారు. ప్రస్తుతం దక్షిణ కొరియా, సింగపూర్‌, దుబాయ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ వివాదాలకు పెట్టింది పేరు. ఇది కాలుష్య కారక పరిశ్రమ కావడంతో పరిసర ప్రాంత ప్రజలు దీనిని మూసివేయాలని ఎంతకాలంగానో డిమాండ్‌ చేస్తున్నారు. కంపెనీ నుంచి కాలుష్య వ్యర్థ జలాలను యథేచ్ఛగా మురుగునీటి కాల్వలోకి వదిలేస్తున్నారు. ఈ జలాలు కొత్తపాలెం వ్యవసాయ క్షేత్రాలకు చేరుతుండటంతో... తరచూ రైతులు ఆందోళన చేస్తుంటారు. ఏడాదిన్నర క్రితం ప్లాంటు విస్తరణ కోసం సంస్థ యాజమాన్యం మరో 25 ఎకరాలు తీసుకుంది.

Updated Date - 2020-05-08T09:46:55+05:30 IST