జగనన్న తోడు బ్యాంకర్ల గోడు!

ABN , First Publish Date - 2020-11-25T09:31:49+05:30 IST

ఒక వ్యక్తికి మీరు ఆసరా అవ్వాలనుకున్నారు. దగ్గరుండి మరో వ్యక్తి నుంచి అప్పుగా అతడిని కొంత సాయం ఇప్పించారు. అప్పుడు అప్పుఇచ్చిన వ్యక్తికి పూచీ ఎవరు? మీరే కదా! కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘పూచీ నాది కాదు’ అని అంటోంది. పైగా, తాను సూచించినవారికి సాయం చేయాల్సిందేనని బ్యాంకులపై ఒత్తిడి తెస్తోంది. వీదివ్యాపారులకు రూ. 10 వేలు రుణం అందించే ‘జగనన్న తోడు’ పథకం విషయంలో జగన్‌ సర్కారు విచిత్ర వైఖరి ఇది. దీంతో ఈ పథకం అమలులో ప్రభుత్వానికి ‘తోడు’గా నిలిచేందుకు

జగనన్న తోడు బ్యాంకర్ల గోడు!

పూచీ లేకపోవడంతో బ్యాంకుల గగ్గోలు.. మంజూరు పత్రాలిచ్చి సర్కారు మమ

వైసీపీ కార్యకర్తలతో భారీగా దరఖాస్తులు.. ఒకే తోపుడుబండితో 50 మంది దరఖాస్తు

ప్రభుత్వం తీరుపై బ్యాంకర్ల అసహనం.. నేడు పథకం ప్రారంభించనున్న సీఎం

ఇలాంటి పథకమే  అమలు చేస్తున్న కేంద్రం.. రుణానికి పూచీతో పేచీ లేకుండా అప్పు

నేడు పథకం ప్రారంభించనున్న సీఎం

ప్రభుత్వ తీరుపై బ్యాంకర్ల అసహనం


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ఒక వ్యక్తికి మీరు ఆసరా అవ్వాలనుకున్నారు. దగ్గరుండి మరో వ్యక్తి నుంచి అప్పుగా అతడిని కొంత సాయం ఇప్పించారు. అప్పుడు అప్పుఇచ్చిన వ్యక్తికి పూచీ ఎవరు? మీరే కదా! కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘పూచీ నాది కాదు’ అని అంటోంది. పైగా, తాను సూచించినవారికి సాయం చేయాల్సిందేనని బ్యాంకులపై ఒత్తిడి తెస్తోంది. వీదివ్యాపారులకు రూ. 10 వేలు రుణం అందించే ‘జగనన్న తోడు’ పథకం విషయంలో జగన్‌ సర్కారు విచిత్ర వైఖరి ఇది. దీంతో ఈ పథకం అమలులో ప్రభుత్వానికి ‘తోడు’గా నిలిచేందుకు బ్యాంకర్లు సుముఖత చూపడం లేదు. కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న పథకం దరఖాస్తుల తీరు వారిని మరింత అసహనానికి గురి చేస్తోంది. ఈ తరహా పథకాలను ప్రకటించేటప్పుడు బ్యాంకుల సామర్థ్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా అని కొందరు బ్యాంకర్లు వాపోతున్నారు. ఇలాంటి పథకాన్నే పట్టణ తోపుడుబళ్ల వర్తకుల కోసం కేంద్రం కూడా అమలుచేస్తోంది. బ్యాంకు క్లియర్‌ చేసే ప్రతి దరఖాస్తుకూ కేంద్రం పూచీ ఉంటోంది. దీంతో పేచీ పెట్టకుండా బ్యాంకులు చక్కగా అర్హులకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ‘జగనన్న తోడు’ను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. కలెక్టర్లు దీనికి సంబంధించి వేలసంఖ్యలో మంజూరుపత్రాలు సిద్ధం చేశారు.


ఆ పత్రాలు తీసుకెళితే బ్యాంకులు రుణం ఇస్తాయని లబ్ధిదారులకు చెబుతున్నారు. పూచీకత్తు విషయం మాత్రం కావాలనే విస్మరిస్తున్నారు. ఇదంతా చూసినవారు..  ప్రభుత్వ తీరు వీధి వ్యాపారులకు రుణాలిచ్చి న్యాయం చేసేరీతిలో లేదని, ఏదో ఒక మంజూరుపత్రం ఇచ్చి చేతులు దులిపేసుకుంటోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికీ బ్యాంకు రుణాలివ్వాలంటే మరో పదేళ్లు పడుతుందని బ్యాంకర్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకులు తమకున్న సామర్థ్యాన్ని బట్టి రుణ విడుదల ప్రక్రియ పూర్తి చేస్తుంది. అలా చూస్తే, ఒక దరఖాస్తును ప్రాసెస్‌ చేసేందుకు కనీసం 14 రోజుల సమయం పడుతుందని అంచనా. నెలలో ఒక్కో బ్యాంకు పరిమిత సంఖ్యలో మాత్రమే రుణాల ప్రక్రియను పూర్తిచేయగలదు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులన్నింటికీ రుణాలు ఇవ్వడం బ్యాంకులకు సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. 


కుటుంబాల కంటే దరఖాస్తులే ఎక్కువ

రాష్ట్రవ్యాప్తంగా చిన్న వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా రుణాలిస్తున్నారని వలంటీర్లు అనర్హులతో సైతం దరఖాస్తులు పెట్టించారు. వాస్తవానికి ఇలాంటి పథకం కేంద్ర ప్రభుత్వం కూడా ‘ప్రధానమంత్రి స్వానిధి’ పేరుతో  అమలు చేస్తోంది. పట్టణాల్లో వీధి వ్యాపారులెవరో గుర్తించి వారికి గుర్తింపు పత్రాలు కూడా ఇచ్చారు. పరిమితమైన గుర్తింపు కార్డులు కలిగిన వీధివ్యాపారులకు రుణాలివ్వడం బ్యాంకులకు కూడా అంత ఇబ్బంది రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘జగనన్న తోడు’ కోసం పట్టణాలతోపాటు గ్రామాలనుంచీ ఎంపిక చేస్తోంది. దీంతో సహజంగానే లబ్ధిదారుల జాబితా భారీగా పెరిగిపోయింది. మరోవైపు ఈ పథకం కోసం వైసీపీ కార్యకర్తలే ఎక్కువ సంఖ్యలో క్యూ కడుతున్నారన్న విమర్శలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రెండు పథకాల కోసం ఒకే వ్యక్తి దరఖాస్తు చేస్తున్నారని చాటాచోట్ల బ్యాంకులు చెబుతున్నాయి.


ప్రధానమంత్రి స్వానిధి ద్వారా పట్టణాల్లో వీధి వ్యాపారస్తులకు ఇచ్చే రూ.10 వేల బ్యాంకు రుణాలకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు ఇస్తోంది. ఈ పథకం కింద రుణాలు పొందిన వారు తిరిగి చెల్లించకపోతే కేంద్రం 7 శాతం వడ్డీతో బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జగనన్న తోడు పథకానికి ఎలాంటి పూచీకత్తు ఇవ్వలేదు. దీంతో బ్యాంకులకు ఈ రుణాలు కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధనలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కొంత మంది బ్యాంకుల ఉన్నతాధికారులతో ఉన్న సత్సంబంధాలతో ఈ రుణాలకు ఒప్పించింది. రిజర్వుబ్యాంకుకు ఫిర్యాదు వెళ్తే జగనన్న తోడుకు రుణాలిచ్చే ప్రసక్తే లేదంటున్నారు.


దరఖాస్తుల వెల్లువ..

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ బ్యాంకు ఖాతాలుంటే అక్కడ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. సర్వీసు ఏరియాతో సంబంధంలేకుండా వలంటీర్లు దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా బ్యాంకులకు తెస్తున్నారు.  ఇన్ని రుణాలు ఒకటే దఫా ఇవ్వడం సాధ్యం కాదని మేనేజర్లు మొత్తుకొంటున్నారు. అయితే ముందు శాంక్షన్‌లు ఇవ్వండి... గ్రౌండింగ్‌ ఎప్పుడైనా చేయొచ్చని బ్యాంకర్లపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మళ్లీ గ్రౌండింగ్‌ చేసినా, చేయకపోయినా వందల కోట్ల రుణాలు మంజూరుచేశామని లెక్కలు చెప్పుకొనేందుకు మాత్రమే అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని బ్యాంకర్లు వాపోతున్నారు. దీంతో ఓ బ్యాంకు 260 దరఖాస్తులు స్వీకరించగా అందులో కేవలం 17 దరఖాస్తులకు మాత్రమే ‘జగనన్న తోడు’ రుణాలిచ్చి మిగిలిన వాటిని తిరస్కరించనుంది.

Read more