చెరువులోకి దూసుకెళ్లిన కొత్తకారు

ABN , First Publish Date - 2020-12-05T09:08:54+05:30 IST

మరికొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివాహ నిశ్చితార్థం అనంతరం అప్పుడే కొన్న కొత్తకారులో స్వగ్రామం వెళ్తుండగా..

చెరువులోకి దూసుకెళ్లిన కొత్తకారు

నిశ్చితార్థం జరుపుకొని తిరిగొస్తుండగా ఘటన

కాబోయే వరుడు సహా తల్లిదండ్రులు దుర్మరణం

యానాంలో విషాద ఛాయలు


కె.గంగవరం, డిసెంబరు 4 : మరికొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివాహ నిశ్చితార్థం అనంతరం అప్పుడే కొన్న కొత్తకారులో స్వగ్రామం వెళ్తుండగా.. అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కాబోయే వరుడితోపాటు, అతని తల్లిదండ్రులు ఉన్నారు. పోలీసుల కథనం మేరకు.. యానాంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కామవరపు సీతారామ సత్యప్రసాద్‌(65) చిన్నకుమారుడు కామవరపు సత్య సంతో్‌షచంద్ర ప్రణీత్‌ (32) వివాహ నిశ్చితార్థం గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. ప్రణీత్‌ రాజోలు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అధికారిగా పనిచేస్తున్నారు.


కార్యక్రమం అనంతరం ఓ షోరూంలో కొత్త కారు కొనుగోలు చేసుకుని.. అందులో వారిద్దరితోపాటు.. ప్రణీత్‌ తల్లి, విశ్రాంత లెక్చరర్‌ కామవరపు విజయలక్ష్మి(61) సాయంత్రం తిరిగి యానాం బయలుదేరారు. ప్రణీత్‌ కారు డ్రైవ్‌ చేస్తుండగా తల్లిదండ్రులిద్దరూ వెనుక సీట్లో కూర్చొన్నారు.  జొన్నాడ -యానాం ఏటిగట్టు రహదారిలో కోట గ్రామం వద్ద కారు అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చని అంచనా.  తెల్లవారుజామున కారును వెలికితీయించగా.. అప్పటికే ముగ్గురూ విగతజీవులుగా ఉన్నారని రామచంద్రపురం డీస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. కాగా, మృతి చెందిన  లెక్చరర్‌ విజయలక్ష్మి  యానాంలో అందరికీ సుపరిచితం. సాహిత్య సభలకు వ్యాఖ్యాతగా,  కవయిత్రిగా పేరొందారు. ఆమె అకాల మరణం తీరని లోటని కవి దాట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-05T09:08:54+05:30 IST