గత ప్రభుత్వ అప్పులు సునామీలా మీద పడ్డాయి: మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2020-06-16T19:53:12+05:30 IST

జూన్ 2019లో వైసీపీ అధికారం అందుకున్నప్పటికీ రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ఎన్నో సమస్యలు..

గత ప్రభుత్వ అప్పులు సునామీలా మీద పడ్డాయి: మంత్రి బుగ్గన

అమరావతి: జూన్ 2019లో వైసీపీ అధికారం అందుకున్నప్పటికీ రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ఎన్నో సమస్యలు, అడ్డంకులు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎన్నో పెను సవాళ్లను ఎదురీదవలసి వచ్చిందన్నారు. 2018-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 8.8 శాతం మాత్రమే పెరిగిందన్నారు. అప్పటికే గత ప్రభుత్వం  ఘనంగా చెప్పుకుంటున్న రెండంకెల వార్షిక ప్రగతి అవస్తవమని తేలిందన్నారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలు దాదాపు రూ. 60వేల కోట్ల మేరకు పెండింగ్ బిల్లుల రూపంలో సునామీలా వచ్చిపడ్డాయన్నారు.


2019-20, 2020-21లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21కి సంబంధించిన డివిజబుల్ పూల్లో తగ్గినవాటాతోపాటు కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో ఆదాయ వనరులు తగ్గాయన్నారు. అయితే ఈ అడ్డంకులను అధిగమించి ముందుకు వెళుతున్నామని అన్నారు. ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యతలను.. రాష్ట్ర అభివృద్ది ప్రయోజనాలతో మేళవించి ముందుకు సాగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-16T19:53:12+05:30 IST