-
-
Home » Andhra Pradesh » The High Court was outraged at the delay in filing the appeal
-
అప్పీలు దాఖలులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం
ABN , First Publish Date - 2020-11-27T09:02:43+05:30 IST
తీవ్ర జాప్యంతో రెండో అప్పీలు దాఖలు చేసిన మంగళగిరి తహసీల్దారుకు హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించింది.

మంగళగిరి తహసీల్దార్‌కు రూ.25 వేలు జరిమానా
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తీవ్ర జాప్యంతో రెండో అప్పీలు దాఖలు చేసిన మంగళగిరి తహసీల్దారుకు హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న అధికారులు విధి నిర్వహణలో మరింత జవాబుదారీతనం, జాగ్రత్తతో వ్యవహరించాలన్న సంకేతం పంపించడమే కోర్టు ఉద్దేశమని వ్యాఖ్యానించింది. అదేవిధంగా ఎన్ని రోజులు జాప్యం జరిగిందో గుణించకుండా రిజిస్ట్రీ జ్యుడీషియల్ విభాగం అధికారులు అప్పీలును ముందుకు పంపడంపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తమకు సంబంధించిన స్థల వ్యవహారంలో అధికారుల జోక్యాన్ని అడ్డుకోవాలన్న ‘మంగళగిరి పద్మశాలి సంఘం’ పిటిషన్‌ను 2014 అక్టోబరు 21న మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తిరస్కరించింది.
ఆ తీర్పును పద్మశాలీ సంఘం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సవాల్ చేయగా.. అక్కడ 2015 ఆగస్టు 11న సంఘానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ మంగళగిరి తహసీల్దార్ 2018 సెప్టెంబరులో హైకోర్టులో అప్పీలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. అప్పీలు దాఖలుకు 1016 రోజులు జాప్యం జరిగినట్లు గ్రహించి అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దారుది తీవ్ర నిర్లక్ష్యమని పేర్కొన్నారు. ఇంత ఆలస్యంగా రెండో అప్పీలు దాఖలు చేయడమంటే న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.