ఆర్డినెన్స్‌ తెచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది

ABN , First Publish Date - 2020-05-09T09:40:30+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం ఇరు పక్షాల వాదనలు ముగియడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

ఆర్డినెన్స్‌ తెచ్చే అధికారం  ప్రభుత్వానికి ఉంది

రమేశ్‌కుమార్‌ పిటిషన్‌ వేశాక ఇతర వ్యాజ్యాలకు 

విచారణార్హత లేదు.. వాటిని తిరస్కరించాలి: ఏజీ

ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం ఇరు పక్షాల వాదనలు ముగియడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. కమిషనర్‌ సర్వీసు నిబంధనల సడలింపు, పదవీకాలం కుదింపు, నూతన కమిషనర్‌ నియామకం తదితరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌, జీవోలను సవాల్‌ చేస్తూ మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌తో పాటు మరో 12 మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం శుక్రవారం కూడా వాదనలు కొనసాగించారు. పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంపై రమేశ్‌కుమార్‌ పిటిషన్‌ వేశాక.. ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత ఉండదని, అందువల్ల వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు.


నూతన కమిషనర్‌ జస్టిస్‌ వి.కనగరాజ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి రాతపూర్వక వాదనలు సమర్పిస్తామని అభ్యర్థించడంతో అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. ప్రభుత్వం తరఫు వాదనలు ముగియడంతో పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులైన వేదుల వెంకటరమణ, ఎ.సత్యప్రసాద్‌, పి.వీరారెడ్డి ప్రతి సమాధాన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Updated Date - 2020-05-09T09:40:30+05:30 IST