వైసీపీ వర్గాల ఘర్షణ... ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-06-11T10:09:50+05:30 IST

ఉపాధి హామీ పనుల విషయమై ఇద్దరు వైసీపీ నేతల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది.

వైసీపీ వర్గాల ఘర్షణ... ఒకరి మృతి

రామకుప్పం, జూన్‌ 10: ఉపాధి హామీ పనుల విషయమై ఇద్దరు వైసీపీ నేతల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియాలతాండా పంచాయతీ రామాపురం తాండాలోని బాబునగర్‌ కాలనీకి చెందిన వైసీపీ నేత, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వెంకటేశ్‌ నాయక్‌(40), చక్రియా నాయక్‌ (50) మధ్య ఉపాధి పనుల విషయమై విభేదాలేర్పడ్డాయి. మంగళవారం చక్రియా తన పొలంలో ఊటకుంట తవ్వుతుండగా.. వెంకటేశ్‌ సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. దీనిపై చక్రియా ప్రశ్నించగా.. ఉపాధి పనులను యంత్రంతో చేస్తుండటంతో చిత్రీకరిస్తున్నానని వెంకటేశ్‌ చెప్పాడు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల సభ్యులు కర్రలతో దాడులు చేసుకున్నారు.


ఈ దాడుల్లో వెంకటేశ్‌ తీవ్రంగా గాయపడగా, చక్రియా తలపై గాయమైంది. కుప్పం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేశ్‌ చనిపోయాడు. ఈ విషయం తెలిసి చక్రియా కుటుంబ సభ్యులు పరారయ్యారు. వెంకటేశ్‌ బంధువులు చక్రియా ఆస్తులను ధ్వంసం చేశారు. రెండిళ్లు, గడ్డివామి, బిందుసేద్యం పరికరాలకు నిప్పంటించారు. ఇళ్లలోని తిండి గింజల బస్తాలు, గృహోపకరణాలు బుగ్గయ్యాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని వారిని నియంత్రించారు. 

Updated Date - 2020-06-11T10:09:50+05:30 IST