అమరావతిలోనే రాజధాని

ABN , First Publish Date - 2020-09-13T07:49:48+05:30 IST

అమరావతిలోనే రాజధాని

అమరావతిలోనే రాజధాని

  • 64వేల ప్లాట్‌లు రైతులకు ఇవ్వాలి 
  • జగన్‌ చేయకపోతే బీజేపీ వచ్చి చేస్తుంది
  • గుళ్లను రక్షిస్తాం..దళితులకు అండ 
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ డిబేట్‌లో సోము వీర్రాజు

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 12: రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలనేది రాష్ట్ర బీజేపీ నిర్ణయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతిలో 64వేల ప్లాట్‌లను రైతులకు ఇవ్వాలని కోరారు. ఈ పనిని సీఎం జగన్‌ చేయకపోతే బీజేపీ వచ్చి చేస్తుందని చెప్పారు. శనివారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే, జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘అంతర్వేది ఘటనపై బీజేపీ, జనసేనలు పోరాటం చేస్తేనే, ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. హిందూ ఆలయాల ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం వాటికోసమే ఖర్చుచేయాలి. ప్రజల డబ్బులతో చర్చిలు కట్టకూడదు. కానీ, జగన్‌ ప్రభుత్వం ఇవే పనులు చేస్తోంది.


గతంలో ఏ ఒక్క సీఎం మత రాజకీయాలు చేయలేదు’’అని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారని, నిజానికి వారే మతతత్వ వాదులన్నారు. ‘‘సింహాచలం భూముల్లో మాజీ మంత్రి కొడుకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టుకోవాలనుకుంటారు. అన్నవరం భూముల వ్యవహారం ఏంటి? దేవాలయాలను ఎలా బీజేపీ చూస్తుందో, దళితులను కూడా అలానే చూస్తుంది. దళితులపై దాడులను సహించం. సీతానగరంలో దళిత యువకుడి పై వైసీపీ నాయకుడు ఫిర్యాదు చేస్తే పోలీస్‌ అధికారి గుండు గీయిస్తారా? విశాఖలో ఒక యువకుడికి గుండు గీయిస్తూ వీడియో తీస్తారా? ఇదెక్కడి దారుణం? ప్రభుత్వం అంటే భయం లేదా? ఇది సీఎం జగన్‌ అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-13T07:49:48+05:30 IST