కాల్వలు సరే.. నిల్వ ఎలా?

ABN , First Publish Date - 2020-05-18T09:22:41+05:30 IST

శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ జిల్లాలకు కృష్ణాజలాలను మళ్లించి కరువు నివారించాలని సంకల్పించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌.

కాల్వలు సరే..  నిల్వ ఎలా?

  • 14ఏళ్లుగా కొనసాగుతున్న గాలేరు-నగరి 
  • బ్రహ్మంసాగర్‌ జలాశయం
  • అసంపూర్తిగా అవుకు టన్నెల్‌ పనులు
  • గండికోటకు పునరావాసం అడ్డంకి
  • పూర్తి సామర్థ్యం నింపాలంటే 1,345 కోట్లు ఇవ్వాలి
  • అసంపూర్తి నిర్మాణాలు, జలాశయాల్లో సమస్యలు 
  • కాల్వల సామర్థ్యం పెంచినా సీమకు ప్రయోజనం నిల్‌

తక్కువ రోజుల్లో ఎక్కువ నీటిని తోడుకోవాలి! అందుకు, కాల్వల సామర్థ్యం పెంచాలి!... ఇది బాగానే ఉంది. కానీ, కాల్వల్లో ప్రవహించే నీటిని నిల్వ చేసేదెక్కడ? రాయలసీమలోని ప్రాజెక్టుల సామర్థ్యం అందుకు సరిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన కొత్త ప్రతిపాదనలతో సీమకు ఒరిగేదేమిటి? 


పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో ఏపీ, తెలంగాణ మధ్య అగ్గి రాజేసింది.  శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్సార్‌ఎంసీ) సామర్థ్యం 44వేల క్యూసెక్కులు. దీన్ని 80వేల క్యూసెక్కులకు విస్తరించేందుకు ఈ నెల 5న జీవో.208 జారీ అయింది. అయితే కాలువలను రెట్టింపు సామర్థ్యానికి పెంచితే ఆ నీటి నిల్వకు సరిపడా జలాశయాలు అందుబాటులో ఉన్నాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు, సీమ జలాశయాల తాజా పరిస్థితి, గండికోట పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


కడప, మే 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ జిల్లాలకు కృష్ణాజలాలను మళ్లించి కరువు నివారించాలని సంకల్పించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నై నగరానికి తాగునీటి లక్ష్యంగా 1983లో తెలుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 12 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌, తెలుగంగ ప్రధాన కాలువ, వెలుగోడు, బ్రహ్మంసాగర్‌ జలాశయాలు నిర్మించారు. 1996లో ప్రప్రథమంగా కరువు సీమలో కృష్ణమ్మ పరవళ్లు పెట్టింది.


ఆ తరువాత కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2.6లక్షల ఎకరాలకు సాగు, 640 గ్రామాల్లో 5లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలని 2006లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి గాలేరు-నగరి సుజల స్రవంతికి శ్రీకారం చుట్టారు. పీఆర్‌పీ హెడ్‌ రెగ్యులేటర్‌, ఎస్‌ఆర్‌ఎంసీ కాలువ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచారు. ఫేజ్‌-1లో కర్నూలు జిల్లాలో రూ.2,155కోట్లు, ఫేజ్‌-2లో కడపజిల్లాలో 946.82 కోట్లతో చేపట్టిన పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. కీలకమైన అవుకు టన్నెల్‌, జలాశయాలు పూర్తి చేయకుండానే ఎస్‌ఆర్‌ఎంసీ, జీఎన్‌ఎ్‌సఎ్‌స కాలువలు రెట్టింపు సామర్థ్యానికి విస్తరించడం వల్ల సీమకు అదనపు ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


ఏడాదిలో పైసా ఖర్చు చేయలేదు

గాలేరు-నగరి ప్రాజెక్టు ఫేజ్‌-1 కింద కర్నూలు జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, ఎస్సార్‌ఎంసీ కాలువ 44వేల క్యూసెక్కులకు విస్తరణ, జీఎన్‌ఎ్‌సఎ్‌స ఫ్లడ్‌ కెనాల్‌, గోరుకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, అవుకు ట్విన్‌ టన్నెల్స్‌ పనులు 7 ప్యాకేజీలు రూ.2,155.45 కోట్లతో చేపట్టారు. పనుల్లో జాప్యంతో నిర్మాణ వ్యయం రూ.2,800.83 కోట్లకు చేరింది. 2006 నుంచి 2014 జూన్‌ వరకు తొమ్మిదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన ఖర్చు రూ.1,187కోట్లు. ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక రూ.1,022కోట్లు ఖర్చు చేశారు. 20వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కీలకమైన అవుకు ట్విన్‌ టన్నెల్స్‌లో లెఫ్ట్‌ టన్నెల్‌ ఫాల్ట్‌జోన్‌ తప్పిస్తూ 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో బైపాస్‌ టన్నెల్స్‌ నిర్మించి గండికోటకు 2016లో 6.5టీఎంసీలు, 2017-18లో 11.5టీఎంసీలు ఇవ్వగలిగారు.


రైట్‌ టన్నెల్‌ అసంపూర్తి పనులు పూర్తిచేస్తేనే 20వేల క్యూసెక్కులు తీసుకుపోవడం సాధ్యపడుతుంది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఒక్క రూపాయి కేటాయించలేదు. అవుకు రైట్‌ టన్నెల్‌ బ్యాలెన్స్‌ పనులకు రూ.105కోట్లతో టెండర్లు పిలిచారు. ఇక ఫేజ్‌-2 కింద రూ.2,189కోట్లతో కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రధాన కాల్వ, పంట కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణాలు 14 ప్యాకేజీలుగా చేపట్టారు. కడప జిల్లాలో 1-7 ప్యాకేజీలు చేపట్టారు. రూ.946.82కోట్లతో 2006లో ప్రారంభించిన పనులు 20శాతం కూడా పూర్తి కాలేదు. సవరించిన అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.3,177.34కోట్లకు చేరింది. ప్యాకేజీ-1, 2లకు 2019లో రీటెండర్లు వేయగా జగన్‌ సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి రివర్స్‌ టెండర్లు వేశారు. 


గండికోట నిండాలంటే...

గండికోట జలాశయం సామర్థ్యం 26.850టీఎంసీలు. పునరావాస ప్యాకేజీ (ఆర్‌అండ్‌ఆర్‌) పూర్తిగా ఇవ్వకపోవడంతో 11-12టీఎంసీలు కూడా నింపలేని పరిస్థితి. చంద్రబాబు పునరావాస ప్యాకేజీ రూ.6.75లక్షలకు పెం చి రూ.479కోట్లు ఇవ్వగా సీఎం జగన్‌ రూ.10లక్షలు  ఇస్తామని హామీ ఇచ్చారు. మూడు గ్రామాలకు పునరావాస ప్యాకేజీ రూ.943కోట్లకు ప్రతిపాదనలు పంపారు. మరో 6 గ్రామాలు ఖాళీ చేయడానికి సుమారు రూ. 350-400 కోట్లు కావాలని అంచనా. ఈ ప్యాకేజీ ఇవ్వనిదే 27 టీఎంసీలు నిల్వ చేయడం అసాధ్యం. ఇటీవల కొండాపురం గ్రామానికి ఒక్కటే బ్యాలెన్స్‌ నిధులతో కలిపి రూ.145కోట్లు ఇచ్చారు. చిత్రావతి రిజర్వాయర్‌ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా పునరావాస ప్యాకేజీ సమస్య వల్ల 6 టీఎంసీలు, సర్వరాయసాగర్‌ సామర్థ్యం 3.060 టీఎంసీలు కాగా.. అసంపూర్తి పనుల వల్ల 1.50 టీఎంసీలకు మించి నిల్వ చేయలేని పరిస్థితి ఉంది. తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 17.740 టీఎంసీలు. నాణ్యతా లోపాల కారణంగా 8-10 టీఎంసీలు నింపితే లీకేజీ వస్తుంది.  


గుండ్రేవుల, సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తేనే...

సుంకేసుల ఎగువన తంగభద్ర నదిపై 20టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం, శ్రీశైలం జలాశయం 854 అడుగుల లెవల్‌లో సిద్ధేశ్వరం అలుగు(బ్రిడ్జి కం బ్యారేజీ) నిర్మాణానికి పాదయాత్ర సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చారని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్‌ బొజ్జా దశరథరామిరెడ్డి గుర్తు చేశారు. గుండ్రేవుల జలాశయం డీపీఆర్‌ కూడా ప్రభుత్వం వద్ద ఉంది. చంద్రబాబు ప్రభుత్వం 2019 డిసెంబరు 21న రూ.2,890కోట్లు మంజూరు చేస్తూ జీవో.154 జారీ చేసింది. జలాశయాలు నిర్మించకుండా పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌ఎంసీ కాలువను 80 క్యూసెక్కులకు విస్తరించడం వల్ల బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి ఎస్కేప్‌ చానల్‌ ద్వారా నిప్పులవాగు, కుందూ నదికి అక్కడినుంచి పెన్నానదికి, నెల్లూరు జిల్లా సోమశిల, కండలేరు జలాశయాలు నింపడం తప్ప రాయలసీమకు ఆశించిన ప్రయోజనం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2020-05-18T09:22:41+05:30 IST