-
-
Home » Andhra Pradesh » The bus is not dull
-
బండి కాదు.. మొండి!
ABN , First Publish Date - 2020-12-10T08:28:30+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థకు కరోనా దెబ్బ గట్టిగా తగిలింది. నెలల తరబడి నడపక పోవడంతో ఆదాయం కోల్పోవడం ఒక దెబ్బ

ప్రజారవాణాకు ‘అనారోగ్యం’.. అసలే డొక్కు, ఆపై కరోనా దెబ్బ
నో సెల్ఫ్ స్టార్ట్.. లైట్లూ వెలగవు
పైనుంచి కారే వర్షపు నీరు
విడి భాగాలు ఇవ్వని అధికారులు
సగం బస్సులు పక్కకు పెట్టాల్సిందే
కొత్తవి కొనకుండా ‘ఖర్చు’ తగ్గింపు
ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణా సంస్థగా ఒకప్పుడు ప్రఖ్యాతిగాంచిన ఏపీఎస్‌ఆర్టీసీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. కరోనా దెబ్బకు ‘బస్సు’ కుదేలైపోయింది. ప్రభుత్వంలో విలీనం తర్వాత అన్నీ బాగుంటాయనుకుంటే సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థకు కరోనా దెబ్బ గట్టిగా తగిలింది. నెలల తరబడి నడపక పోవడంతో ఆదాయం కోల్పోవడం ఒక దెబ్బ! బస్సులు డొక్కుగా మారిపోవడం దెబ్బ మీద దెబ్బ. ఆర్టీసీకి 12,500 బస్సులున్నాయి. ఈ ఏడాది మార్చి 22న లాక్‌డౌన్ విధించడంతో అవన్నీ డిపోలకు పరిమితమయ్యాయి. అన్‌లాక్‌లో భాగంగా మే 17వ తేదీ నుంచి అరకొరగా బస్సులు తిరగడం మొదలైంది. ఇప్పటికీ బస్సులను పూర్తిస్థాయిలో నడపడం లేదు. నెలల తరబడి నిర్వహణ లేక బస్సులను అలాగే నిలిపి ఉంచడంతో సగం బస్సులకు సెల్ఫ్ స్టార్టర్లు పాడయ్యాయి.
చాలా బస్సులకు వైరింగ్ వ్యవస్థ దెబ్బతిని లైట్లు వెలగడంలేదు. మరీ దారుణమేమిటంటే... వర్షాలు కురిసినప్పుడు టాప్ నుంచి నీరు లీక్ అవుతూ... ప్రయాణికులను తడిపేస్తోంది. నిర్వహణ ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా విడిభాగాలపై 60శాతానికి పైగా కోత విధించి డొక్కు బండితో కాలం గడిపేస్తున్నారు. బస్సుల పరిస్థితి గురించి డ్రైవర్లు డిపోల్లో చెప్పినా పెద్దగా స్పందన కనిపించడంలేదు. గ్యారేజీల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం వస్తున్నా ఉన్నతాధికారులు వ్యూహాత్మక ‘మౌనం’ పాటిస్తున్నారు. మరమ్మతులకు సంబంధించి ఫోర్ మెకానిక్ పెట్టిన విడి భాగాల ఇండెంట్‌లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ 50 శాతం కోత విధిస్తున్నారు. అక్కడి నుంచి స్టోర్స్‌కు వెళ్లే సరికి మరో 15శాతం వరకూ తగ్గించి ఇస్తున్నారు.
కాలం చెల్లిన బస్సులు ఏడు వేలు...
ఏపీఎ్‌సఆర్టీసీలో 12,500 బస్సులు ఉండగా వాటిలో కాలం చెల్లినవి 7వేలు ఉన్నట్లు ఏడాది క్రితమే అప్పటి ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు ప్రభుత్వానికి నివేదించారు. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది మొదట్లో కాలం చెల్లిన బస్సుల్లో సుమారు వెయ్యి బస్సులను కార్గో, ఇతర అవసరాలకు మార్చేశారు.
ఇంకా ఐదున్నర వేలకుపైగా గడువు తీరిన బస్సులు రోజూ రోడ్లపైకి వస్తూనే ఉన్నాయి. అవి ఎక్కడికక్కడే ఆగిపోతుండటంతో ప్రయాణికులు తోయాల్సి వస్తోంది. ఆర్టీసీలో మంచి ఆదరణ పొందిన సూపర్ లగ్జరీ బస్సులదీ ఇదే పరిస్థితి. ఇక ‘పల్లె వెలుగు’ బస్సుల దుస్థితి చెప్పాల్సిన పనేలేదు.
రోడ్ల దెబ్బకు మరింత కుదేలు..
అసలే డొక్కు బస్సులు... ఆపై రోడ్ల నిండా గోతులు! ఇటువంటి రోడ్లపైకి కండీషన్ లేని బస్సులు తీసుకెళ్లాలంటే డ్రైవర్లు భయపడుతున్నారు. అయినా సరే కేఎంపీఎల్ తీసుకురావల్సిందే అంటూ పై అధికారులు ఒత్తిడి పెంచుతుండటంతో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. పాత బస్సులను పూర్తిగా వదిలించుకుని వాటి స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో జీవో జారీ చేసింది.
300 ఏసీ బస్సులు కొనుగోలు చేసిన యాజమాన్యం వాటిని ఇంకా రోడ్లపైకి తీసుకురాలేదు. మరిన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కరోనా సమయంలోనూ ప్రయాణికులు ఆర్టీసీని బాగా ఆదరిస్తున్నా.. పాత బస్సులే తిప్పుతాం, తిప్పలు పెడతాం అన్నట్లుగా ఆర్టీసీ తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.