విదేశాల నుంచి 30వేల మంది రాక : కృష్ణబాబు

ABN , First Publish Date - 2020-05-10T09:44:24+05:30 IST

వివిధ ఉద్యోగాలు, వృత్తుల రీత్యా విదేశాల్లో స్థిరపడిన రాష్ట్రవాసులు సుమారుగా 30వేల మంది వరకూ తిరిగి ప్రత్యేక విమానాల్లో వచ్చే అవకాశం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌

విదేశాల నుంచి 30వేల మంది రాక : కృష్ణబాబు

  • రేపు అమెరికా నుంచి తొలి విమానం..
  • శంషాబాద్‌లో దిగి ఇక్కడికి రాక
  • ఇప్పటిదాకా 11,860 మంది కూలీల తరలింపు..
  • 3 అవసరాలకే ఇక పాస్‌
  • దీని కోసం స్పందన వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్‌


విజయవాడ, మే 9(ఆంధ్రజ్యోతి): వివిధ ఉద్యోగాలు, వృత్తుల రీత్యా విదేశాల్లో స్థిరపడిన రాష్ట్రవాసులు సుమారుగా 30వేల మంది వరకూ తిరిగి ప్రత్యేక విమానాల్లో వచ్చే అవకాశం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు వెల్లడించారు. వివిధ కారణాల రీత్యా 15వేల నుంచి 20వేల మంది కచ్చితంగా రాష్ట్రానికి రావొచ్చని అంచనా వేశారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.


విదేశాల నుంచి వచ్చే లైట్‌ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు అవసరమైన వాతావరణం రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో లేనందున అవి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు వస్తాయని చెప్పారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాలను రాష్ట్రానికి నడపాలని విదేశాంగశాఖకు విజ్ఞప్తి చేశామన్నారు. ప్రయాణికులకు అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత కరోనా లక్షణాలు ఉంటే సమీపంలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపుతామన్నారు.


2వేల పెయిడ్‌ క్వారంటైన్‌ కేంద్రాలు

పెయిడ్‌ క్వారంటైన్‌ కేంద్రాలకు విజయవాడలో 2 వేల గదులు సిద్ధం  చేయాలని కృష్ణాజిల్లా యంత్రాంగం నిర్ణయించింది. స్టార్‌ హోటల్స్‌, బడ్జెట్‌ హోటల్స్‌, చివరిగా లాడ్జిల్లోని గదుల్లోలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. విజయవాడ(గన్నవరం) ఎయిర్‌పోర్టుకు సోమవారం తొలి విమానం రాబోతోంది. ఇందులో 100 మంది ప్రవాసులు దిగే అవకాశం ఉందని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-05-10T09:44:24+05:30 IST