ఆలయాల్లో దర్శన భాగ్యం!

ABN , First Publish Date - 2020-05-13T08:38:31+05:30 IST

భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవుళ్ల దర్శనాలకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది.

ఆలయాల్లో దర్శన భాగ్యం!

లాక్‌డౌన్‌పై స్పష్టతే తరువాయి

ఉదయం ఆరు నుంచి సాయంత్రం 

6 వరకు భక్తులకు అనుమతి

అంతరాలయ దర్శనాలు, తీర్థం బంద్‌

మాస్క్‌, భౌతికదూరం, టైమ్‌స్లాట్‌ తప్పదు

ఎస్‌ఎంఎస్‌ ద్వారా దర్శనాల బుకింగ్‌

ఈవోలకు దేవదాయశాఖ మార్గదర్శకాలు

తిరుమల శ్రీవారి దర్శనం 28 తర్వాతే!

రోజుకు 20 వేల మంది భక్తులకే చాన్స్‌


అమరావతి/తిరుపతి/విజయవాడ, మే 12(ఆంధ్రజ్యోతి): భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవుళ్ల దర్శనాలకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. లాక్‌డౌన్‌పై స్పష్టత రాగానే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు సహా 6(బీ) కేటగిరీ ఆలయాల్లో భక్తులను అనుమతించనున్నట్టు దేవదాయశాఖ స్పష్టం చేసింది. అయితే, కరోనా నేపథ్యంలో భక్తులు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపింది. భౌతిక దూరం పాటించడం సహా ఎస్‌ఎంఎస్‌ ద్వారా టైమ్‌స్లాట్‌ను బుక్‌ చేసుకోవాలని పేర్కొంది.దీనికి సంబంధించి ఆలయాల ఈవోలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తూ దేవదాయశాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు.ఎస్‌ఎంఎస్‌ ద్వారా 24 గంటలు ముందుగానే స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించాలని, గంటకు 250 మందికి మించకుండా దర్శనాలు కల్పించాలని సూచించారు. ఆధార్‌ నంబరుతో సహా దర్శన సమయాన్ని ఎస్‌ఎంఎ్‌సలో భక్తులు తెలపాలన్నారు.


అయితే, అంతరాలయ దర్శనాలను, శఠగోపం, తీర్థం పంపిణీలను నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ఆలయాల ప్రవేశాల వద్ద సబ్బులు, శానిటైజర్లు ఉంచుతారు. వీలును బట్టి ప్రవేశమార్గం వద్ద శానిటైజర్‌ స్ర్పే చేసే టన్నెళ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి భక్తునికీ ఖచ్చితంగా మాస్క్‌ ఉండాలని, ఆలయాల పరిసరాల్లో మాస్కులు విక్రయించేలా చూడాలన్నారు. భక్తుల దర్శనానికి వీలుగా శ్రీకాళహస్తి, కాణిపాకం వినాయక ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. ఆలయంలోపల, వెలుపల భక్తుల క్యూలైన్లలో మీటరు దూరం ఉండేలా వృత్తాలు గీయించారు. శ్రీకాళహస్తిలో భౌతికదూరం పాటిస్తూ రాహుకేతు పూజలు ప్రారంభం కానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలతోపాటు జిల్లాలోని పంచారామ క్షేత్రాల్లోనూ భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 


శ్రీవారి దర్శనంపై 28న నిర్ణయం!

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. అధికారికంగా వెల్లడించకపోయినా.. టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు చర్చించుకుని ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక తొలుత స్థానికులకు రోజుకు 5 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. లోటుపాట్లు సరిచేసుకున్నాక అన్ని ప్రాంతాల భక్తులనూ అనుమతించనున్నట్టు తెలుస్తోంది. రోజులో గంటకు వెయ్యి మంది చొప్పున రోజుకు గరిష్ఠంగా 20 వేల మందినే అనుమతించే అవకాశముంది. ఆర్జిత సేవలు కొంతకాలం నిలిపివేయనున్నారు. గదుల కేటాయింపు ఉండదు. ఈ నెల 17న లాక్‌డౌన్‌ ఎత్తివేసినా 28వ తేదీన పాలకమండలిలో చర్చించాకే దర్శనాలకు అనుమతించే అవకాశం ఉంది. 


వెంటాడుతున్న కరోనా భయం

తిరుమలలో పాక్షికంగా దర్శనాలకు అనుమతించినా కరోనా ముప్పు పొంచి ఉం టుందనే భయం అధికారులను వెంటాడుతోంది. అలిపిరి టోల్‌గేట్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోపల.. భక్తులకు సెక్యూరిటీ చెకింగ్‌ ఉంటుంది. భక్తులను గార్డులు చేతులతో తడిమి తనిఖీ చేస్తారు. కరోనా నేపథ్యంలో ఇది చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ఇక, కళ్యాణకట్టల్లో తలనీలాల సమర్పణకు అనుమతిచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదమేనని భావిస్తున్నా రు. అయితే, ఈ విషయాలపై కూడా కసరత్తు పూర్తయిందని సమాచారం.


ఆన్‌లైన్‌లో ‘అరసవల్లి’ ఆర్జిత సేవలు

అరసవల్లి: అరసవల్లి సూ ర్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం నుంచి ఆన్‌లైన్‌ ఆర్జిత సేవలు అం దుబాటులోకి తెచ్చినట్టు ఈ వో హరిసూర్యప్రకాశ్‌ తెలిపా రు. సూర్య నమస్కారాలకు రూ.50, క్షీరాభిషేకానికి రూ.500, కళ్యాణసేవకు రూ. 500, అన్నదానానికి రూ.500 భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉం టుందని సూచించారు. దేవస్థానం ఎస్‌బీఐ అకౌంట్‌ నంబర్‌ 11152303078కు కాని, ఆంధ్రాబ్యాంక్‌ అకౌంట్‌ 211110100009099కు రుసుం చెల్లించాలన్నారు. సంబంధిత రశీదుతో పాటు గోత్రనామాల వివరాలు ఆలయ అధికారుల వాట్సాప్‌ నంబర్లు 8978914660, 9491000708కు పంపిస్తే పూజలు చేయిస్తామని ఆయన తెలిపారు.


దుర్గ గుడి వద్ద డిజిన్‌ఫెక్షన్‌ టన్నెల్‌


బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కొండపై ఘాట్‌రోడ్డు దగ్గర డిజిన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ ఈ టన్నెల్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్లను దేవస్థానం ఈవో సురే్‌షబాబు మంగళవారం పరిశీలించారు.

Read more