ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

ABN , First Publish Date - 2020-03-18T08:52:18+05:30 IST

ఎంబీబీఎస్‌ చదివేందుకు ఫిలిప్పీన్స్‌ వెళ్లిన విద్యార్థులు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో కరోనా వైరస్‌ నేపథ్యంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. వారందర్నీ...

ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

కౌలాలంపూర్‌లో మరికొందరు అవస్థలు 

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు


కందుకూరు, గుంటూరు, మదనపల్లె టౌన్‌, మార్చి 17: ఎంబీబీఎస్‌ చదివేందుకు ఫిలిప్పీన్స్‌ వెళ్లిన విద్యార్థులు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో కరోనా వైరస్‌ నేపథ్యంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. వారందర్నీ స్వదేశానికి వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారంతా ప్రత్యేక విమానాల్లో హడావిడిగా భారత్‌కు పయనమయ్యారు. ఈలోగా ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలను భారత్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో వారిని మలేసియాలోని కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో ఆపేశారు. కొందరినేమో ఫిలిప్పీన్స్‌లోని మనీలా ఎయిర్‌పోర్టులోనే ఆపేయడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. భారత్‌కు వస్తున్న 300 మంది విద్యార్థుల్లో సుమారు 160 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. వారిలో ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందిన 10 మంది, చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన విద్యార్థి కూడా ఉన్నారు. తిరిగి మనీలా వెళ్లిపోవాలంటూ కొందరు భారత అధికారులు చెబుతున్నారని విద్యార్థులు తెలిపారు. అటు ఫిలిప్పీన్స్‌ తమను స్వదేశానికి వెళ్లిపొమ్మందని, ఇటు భారత్‌ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఆహార, వైద్య సదుపాయాలు కూడా లేవని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక విమానం మలేసియా చేరుకోగా వారంతా కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ పిల్లలు ఎలాగైనా స్వదేశం చేరేలా చేయాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అయితే, ఎయిర్‌ ఏసియా విమానాల ద్వారా వారిని విశాఖపట్టణం, ఢిల్లీ తరలించ డానికి భారత్‌ అనుమతించడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-03-18T08:52:18+05:30 IST