తెలంగాణ తోడేస్తోంది
ABN , First Publish Date - 2020-05-24T08:11:07+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ 255.93 టీఎంసీలను కృష్ణా నది నుంచి తోడేస్తోందంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు రాష్ట్ర సాగు నీటి వినియోగ సంఘాల సమాఖ్య ఫిర్యాదు...

కృష్ణానది నుంచి 255.93 టీఎంసీలు స్వాహా
తక్షణమే సుప్రీం ఆదేశాలు అమలు చేయండి
అపెక్స్ కౌన్సిల్‌లో తీర్మానించి నిలుపుదల చేయండి
కేంద్ర జలశక్తి మంత్రికి రాష్ట్ర సాగు నీటి సంఘాల లేఖ
అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ 255.93 టీఎంసీలను కృష్ణా నది నుంచి తోడేస్తోందంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు రాష్ట్ర సాగు నీటి వినియోగ సంఘాల సమాఖ్య ఫిర్యాదు చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులను నిలిపేయాలని విజ్ఞప్తి చేసింది. సుప్రీంకోర్టు కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తగు నిర్ణయం తీసుకోవాలని సూచించినందున తక్షణమే ఈ భేటీని ఏర్పాటు చేసి.. ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి స్టాప్ ఆర్డర్‌ను ఇవ్వాలని సమాఖ్య కోరింది. ఈ మేరకు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నిర్మిస్తోన్న సాగు నీటి ప్రాజెక్టుల సమగ్ర సమాచారంతో సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు శనివారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
సీమ ప్రాజెక్టులను అడ్డుకోవద్దు: టీజీ
కర్నూలు(ఎడ్యుకేషన్): ‘‘రాయలసీమలో చేపట్టే ప్రాజెక్టులను ఎవరూ అడ్డుకోవద్దు. కర్ణాటకలో తుంగభద్ర నదిపై అక్రమంగా జలాలను వాడుకుంటున్నా తెలంగాణ నాయకులు నోరెత్తడం లేదు. రాయలసీమ ప్రాజెక్టులు వచ్చేసరికి అడ్డుకోవడం సరైంది కాదు. జీఓ 203కు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులు సాగు నీటికి కాకపోయినా కనీసం తాగడానికైనా ఉపయోగపడాలి’’ అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం కర్నూలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని గతంలోనే కొంతమంది నాయకులు ప్రభుత్వానికి లేఖలు రాశారన్నారు. ఇందుకు భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు తెలుపుతుందని అన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులను చేపట్టేందుకు ముందుకెళితే వారిపై తెలంగాణ నాయకులు బండలు వేస్తున్నారని ఆరోపించారు.