టపాసులపై నిషేధం
ABN , First Publish Date - 2020-11-13T09:29:16+05:30 IST
టపాసులు లేకుండానే ఈ సారి దీపావళి జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా బాణసంచా విక్రయాలను తక్షణం నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్
తెలంగాణ హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): టపాసులు లేకుండానే ఈ సారి దీపావళి జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా బాణసంచా విక్రయాలను తక్షణం నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. బాణసంచా దుకాణాలను మూసివేయాలని తేల్చిచెప్పింది. టపాసుల వల్ల వాయుకాలుష్యం పెరిగి.. పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలని సూచించింది. ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. బాణసంచాను నిషేధించాలంటూ కూకట్‌పల్లికి చెందిన ఇంద్రప్రకాశ్ అనే న్యాయవాది దాఖలుచేసిన పిల్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో బాణసంచా క్రయవిక్రయాలను నిషేధించినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ కోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ మండిపడింది. కాలుష్యాన్ని అరికట్టాలంటే.. ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను తీసివేయాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు.