ముఖ్యమంత్రికి మతిమరుపు జబ్బు ఉన్నట్టుంది: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2020-10-28T01:02:54+05:30 IST
సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రికి జ్ఞాపకశక్తి తక్కువ. ఆయనకు మతిమరుపు జబ్బు ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు

అమరావతి: సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రికి జ్ఞాపకశక్తి తక్కువ. ఆయనకు మతిమరుపు జబ్బు ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు కావాల్సినంత పోలీస్ బందోబస్త్‌ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. నేడు లోకేశ్ పర్యటనలో ప్రభుత్వం కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లనే నియమించింది. లోకేశ్ రైతులను పరామర్శించడం, ట్రాక్టర్ తోలడం జగన్‌కు నేరంలా కనిపించినట్టుంది. అందుకే ఆయన చర్యలకు సంబంధం లేకుండా చట్ట విరుద్ధంగా లోకేశ్ పై ఐపీసీ సెక్షన్ 279, సెక్షన్ 184 (ఎంవీయాక్ట్), సెక్షన్ 54, సెక్షన్ -3 నమోదు చేశారు. లోకేశ్‌పై ఆకివీడు పోలీసులు పెట్టిన కేసులన్నీ తప్పులతడకే. ట్రాక్టర్ నడపడంలో ఏ తప్పు చేయలేదు. లోకేశ్‌పై మోపిన సెక్షన్లు ఆయనకు ఎలా వర్తిస్తాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మోకాలి లోతు నీటిలో, బురదలో ట్రాక్టర్‌ని వేగంగా, నిర్లక్ష్యంగా లోకేశ్ ఎలా నడిపారో జగన్ చెప్పాలి. లోకేశ్‌పై పెట్టిన కేసులన్నీ ముఖ్యమంత్రి కక్షసాధింపుల్లో భాగంగా పెట్టినవే. జగన్మోహన్ రెడ్డి తానా అంటే, కొందరు అధికారులు తందానా అంటున్నారు. చట్టాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చెప్పినట్టు పనిచేసే అధికారులంతా ఒక్కసారి భవిష్యత్ గురించి ఆలోచన చేస్తే మంచిది. సుప్రీంకోర్టు కరుడుగట్టిన నేరస్తులకే బేడీలువేయాలని చెప్పింది. ముఖ్యమంత్రి మాత్రం అన్నంపెట్టే రైతులకు బేడీలు వేయించారు. అన్నదాతలు ముఖ్యమంత్రి కళ్లకు టెర్రరిస్టుల్లా, నక్సలైట్లలా, నాందేడ్ గ్యాంగులా కనిపించారా? లోకేశ్ పర్యటనపై బిల్డప్ రాయుడు విజయసాయిరెడ్డి ఎందుకంతలా స్పందిస్తున్నారో తెలియడంలేదు’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.