కొందరు మంత్రులు.. కుక్కల కంటే హీనం!

ABN , First Publish Date - 2020-12-19T07:29:10+05:30 IST

జగన్‌ కేబినెట్‌లోని కొందరు మంత్రులు కుక్కల కంటే హీనంగా బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

కొందరు మంత్రులు.. కుక్కల కంటే హీనం!

ప్రతి ఒక్కరి చిట్టా రాస్తున్నాం..ఎవరినీ వదిలిపెట్టేది లేదు 

జగన్‌ చేతగాని దద్దమ్మ: అచ్చెన్నాయుడు


విజయవాడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జగన్‌ కేబినెట్‌లోని కొందరు మంత్రులు కుక్కల కంటే హీనంగా బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. తప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరి చిట్టా రాస్తున్నామని, టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు ఎస్సీ వికలాంగులకు మోటారు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతగాని దద్దమ్మని విమర్శించారు. ఆయనకు సంపద సృష్టించడం చేతగాక ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. జగన్‌ దొంగని తెలిసి కూడా ఓట్లేసినందుకే ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.


సొంత అవసరాల కోసం పార్టీలు మారే నాయకులకు ఈ సారి టీడీపీలో చోటుండదని అచ్చెన్న స్పష్టం చేశారు. తమ హయాంలో అభివృద్ధి-సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలపై ఎలాంటి పన్నుల భారాన్ని మోపకుండా చంద్రబాబు పరిపాలన సాగిస్తే.. జగన్‌ ప్రజల జుట్టు మీద తప్ప మిగిలిన అన్నింటిపైనా పన్నులు పెంచేశారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా వైర్‌సను కారణంగా చూపిస్తున్న సీఎం.. గురువారం వేలమందితో బీసీల సభ ఎలా నిర్వహించారని నిలదీశారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, విజయవాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు మాట్లాడారు.

Updated Date - 2020-12-19T07:29:10+05:30 IST