సీఎం పదవి కోసమే హోదా భజనా?

ABN , First Publish Date - 2020-06-22T09:02:57+05:30 IST

జగన్మోహన్‌రెడ్డికి ఆయనకు కావాల్సిన ముఖ్యమంత్రి పదవి వస్తే ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదా అని తెలుగుదేశం పార్టీ

సీఎం పదవి కోసమే  హోదా భజనా?

  • కోరినంత మంది ఎంపీలను ప్రజలు ఇస్తే ఏం సాధించారు?
  • కేసుల భయంతోనే కిమ్మనడం లేదా?
  • జగన్‌కు టీడీపీ ప్రశ్న


అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): జగన్మోహన్‌రెడ్డికి ఆయనకు కావాల్సిన ముఖ్యమంత్రి పదవి వస్తే ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. జగన్‌ కోరినంత మంది ఎంపీలను ప్రజలు గెలిపించి ఇస్తే రాష్ట్రానికి ఏం సాధించారని కూడా ఆ పార్టీ నిలదీసింది. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఒక ప్రకటనలో ఈ ప్రశ్నలను సంధించారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై ప్రతి రోజూ మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మాటే మర్చిపోయారు. తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత రాష్ట్రానికి హోదా వస్తే ఏమిటి... రాకపోతే ఏమిటన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్నవాడు ఇప్పుడు ప్రధాని ముందు కనీసం తన మెడ ఎత్తి హోదా అన్న పదం కూడా ఎందుకు పలకలేకపోతున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు.


పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నా ఏడాది కాలంలో రాష్ట్రానికి సాధించింది శూన్యమని, కేంద్రం నుంచి పోరాడి తెచ్చింది ఏదీ కనిపించడం లేదని ఆయన విమర్శించారు. హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ  నాయకులు ప్రకటనలు చేస్తున్నా వైసీపీ ఎంపీలుగానీ, జగన్మోహన్‌రెడ్డిగానీ కిమ్మనడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తే కేసుల విచారణ వేగం పెరుగుతుందన్న భయంతోనే ఆయన చేతులు కట్టుకొని కూర్చుంటున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. 

Updated Date - 2020-06-22T09:02:57+05:30 IST