టీడీపీ రైతు ఉద్యమం

ABN , First Publish Date - 2020-12-28T08:21:24+05:30 IST

రైతులకు సంఘీభావం తెలుపుతూ మూడురోజుల పాటు కలిసొచ్చే పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టనుంది.

టీడీపీ రైతు ఉద్యమం

  • నేటి నుంచి నిరసనలు
  • ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇళ్లకు ఆ పార్టీ నేతలు
  • బాధితులకు ఓదార్పు.. సాయంపై ఆరా
  • పరిహారం తీరుపై రచ్చబండ
  • కలిసొచ్చే పార్టీలతో కలిపి తెలుగుదేశం ఆందోళనలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రైతులకు సంఘీభావం తెలుపుతూ మూడురోజుల పాటు కలిసొచ్చే పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టనుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడం, రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం, పాదయాత్రగా రెవెన్యూ, వ్యవసాయ అధికారుల కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రాలు ఇవ్వడం చేయనుంది. సోమవారం నుంచి బుధవారం వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇటీవల చంద్రబాబు పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతులకోసం ఆందోళనలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను సోమవారం పరామర్శిస్తారు. పార్లమెంటు నియోజకవర్గంవారీగా పార్టీ నాయకులు, తెలుగు రైతు నాయకులు, ఇతర పార్టీల నేతలతో కలిసి ఆయా రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి హామీ వచ్చింది? అది ఏ మేరకు అమలైంది..అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతులు వినియోగించిన చెప్పులు, కండువా, ముళ్లుకర్ర, మేడితోక, పగ్గం, కళ్లజోడు తదితర వస్తువులు సేకరిస్తారు. 


రైతులతో కలిసి..

ఎక్కువమంది రైతుల్ని ఉద్దేశపూర్వకంగానే పంట నష్టపరిహారం జాబితాలో చేర్చలేదని టీడీపీ విమర్శిస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి పరిహార జాబితాలో లేని రైతులతో అక్కడ పొందుపరిచిన జాబితాలను చించివేయించి, తగలబెట్టాలని నిర్ణయించారు. అనంతరం రైతులు, కౌలు రైతులతో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటుచేసి చర్చిస్తారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోలులో రైతులు పడిన ఇబ్బందులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నావడ్డీ, పంటల బీమా, మోటార్లకు మీటర్లు బిగింపు, కౌలు రైతుల సమస్యలపై చర్చిస్తారు.


మండలాల్లో పాదయాత్రలు..

బుధవారం పంటనష్ట పరిహారం నమోదుకాకుండా నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులను పెద్ద ఎత్తున సమీకరించి తహసీల్దార్‌ లేక వ్యవసాయ అధికారి కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్తారు. కౌలు రైతుల తరఫున వినతిపత్రం సమర్పిస్తారు. మొదటిరోజు కార్యక్రమంలో సేకరించిన ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించిన చెప్పులు, ముళ్లుకర్ర లాంటి వస్తువులను కూడా వాళ్లకు అందచేస్తారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నుంచి బీమా చెల్లింపు వరకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో కూడా స్పీకర్‌ పోడియం వద్దకు తొలిసారి వెళ్లి బైఠాయించారు. ఈ ఏడాదిలో ఏడు విపత్తులు వస్తే...కనీసం రైతులకు నష్టపరిహారమూ ఇవ్వలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వీటన్నింటినీ ఈ కార్యక్రమంలో భాగంగా లేవనెత్తనున్నారు.

Updated Date - 2020-12-28T08:21:24+05:30 IST