గాలి సీఎంను.. గద్దె దింపుదాం
ABN , First Publish Date - 2020-12-06T08:58:32+05:30 IST
‘‘ఇది దున్నపోతు ప్రభుత్వం. మాటలతో చెబితే వినదు. ముళ్లకర్రతో పొడవాలి. ఈ ప్రభుత్వం రైతులను అవమానిస్తోంది. గాలి ముఖ్యమంత్రి.. గాలిలోనే చక్కర్లు కొడతాడు. ప్రజల్లోకి రాడు. చంద్రబాబు అసెంబ్లీలో సింహంలా పోరాడుతున్నారు.

రైతులను అవమానిస్తున్నారు
నష్టపరిహారం ఎకరానికి 30 వేలు ఇవ్వాలి
మోటర్లకు మీటర్లు బిగిస్తే పగలగొట్టండి :లోకేశ్
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటన
చీరాల, చిలకలూరిపేట టౌన్, డిసెంబరు 5: ‘‘ఇది దున్నపోతు ప్రభుత్వం. మాటలతో చెబితే వినదు. ముళ్లకర్రతో పొడవాలి. ఈ ప్రభుత్వం రైతులను అవమానిస్తోంది. గాలి ముఖ్యమంత్రి.. గాలిలోనే చక్కర్లు కొడతాడు. ప్రజల్లోకి రాడు. చంద్రబాబు అసెంబ్లీలో సింహంలా పోరాడుతున్నారు. ఉమ్మడిగా ఉద్యమిద్దాం. రైతులుగా మీరు, అన్నగారి మనవడిగా నేను కలసి కదంతొక్కుదాం. గాలి సీఎం ప్రభుత్వాన్ని గద్దె దించేద్దాం’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తుఫాన్‌కు పంటలు నష్టపోయిన అన్నదాతలకు భరోసా కల్పించేందుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో శనివారం ఆయన పర్యటించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
గుంటూరు జిల్లా బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట నియోజకవర్గాలలో, ప్రకాశం జిల్లా చీరాల, కారంచేడు, పరుచూరు మండలాల్లో పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కారంచేడు చినవంతెన సెంటర్లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తక్షణమే పంట నష్టపరిహారం ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చి సగం ప్రీమియం చెల్లించారని లోకేశ్ చెప్పారు. ‘‘వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తే పగలగొట్టండి.. మద్దతుగా నేను కూడా రంగంలోకి దిగుతా. స్వయంగా తగలబెడతా’’ అన్నారు. మూడు నెలల్లో చలో అమరావతి, సీఎం ఇల్లు ముట్టడికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు రైతులు మూడుసార్లు నష్టపోయారని, ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయమంత్రి కన్నబాబు రైతులు సంతోషంగా ఉండాలని చెప్పటం సిగ్గుచేటన్నారు. కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు నరేంద్ర, జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
‘సలాం’ కేసుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి
చిలకలూరిపేటలో జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం జాతీయ అధ్యక్షుడు సయ్యద్ నిసార్ అహ్మద్ లోకేశ్‌ను కలిశారు. సలాం ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరిగేవరకు అండగా నిలవాలని వినతిపత్రం అందించారు. దీంతో న్యాయం జరిగేవరకు పోరాడతామని లోకేశ్ హామీ ఇచ్చారు.
పేర్నిది మరో కోడి కొత్తి డ్రామా..
కాగా, మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం మరో కోడి కత్తి డ్రామాలాంటిదని ట్విటర్లో లోకేశ్ విమర్శించారు.