జగన్‌రెడ్డి రైతు ద్రోహి

ABN , First Publish Date - 2020-12-11T07:59:08+05:30 IST

‘‘రైతు రాజ్యం తెస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... రైతులేని రాజ్యం తెస్తున్నారు. రైతులకు కులం అంటగట్టిన దుర్మార్గుడు

జగన్‌రెడ్డి రైతు ద్రోహి

ఏడుసార్లు ప్రకృతి వైపరీత్యాలు..ఒక్కసారీ  సాయం లేదు

పంటల బీమా కట్టకుండా అసెంబ్లీలో అడ్డంగా దొరికారు

రైతులకు, పార్టీకి మధ్య రైతు విభాగం అనుసంధానకర్త

తెలుగురైతు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో లోకేశ్‌


అమరావతి, డిసెంబరు 10, (ఆంధ్రజ్యోతి): ‘‘రైతు రాజ్యం తెస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... రైతులేని రాజ్యం తెస్తున్నారు. రైతులకు కులం అంటగట్టిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి. వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. నివర్‌పై ముందస్తు హెచ్చరికలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పంట, ప్రాణ నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే ఏడుసార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఒక్కసారి కూడా సక్రమంగా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతులకు బీమా ప్రీమియం రూ.1030 కోట్లు కట్టకుండా... చెల్లించామంటూ అసెంబ్లీలో అబద్ధాలాడి అడ్డంగా దొరికారని విమర్శించారు.


దీంతో రైతులు నష్టపోయారని తెలిపారు. పంటల బీమా కింద రైతులకు ఇంతవరకూ రూపాయి కూడా చెల్లించలేదని దుయ్యబట్టారు. సున్నా వడ్డీతో జగన్‌రెడ్డి గుండు సున్నారెడ్డి అని తేలిపోయిందన్నారు. చెప్పేదొకటి చేసేదొకటి చేసే జగన్‌రెడ్డి రైతు ద్రోహి అని ధ్వజమెత్తారు. ఇటీవల కొత్తగా నియమితులైన తెలుగు రైతు పార్లమెంటు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు గురువారం లోకేశ్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారందరితో ఆయన సమావేశమయ్యారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా అనుబంధ సంఘాల బలోపేతంపై దృష్టిపెట్టామని తెలిపారు.

Updated Date - 2020-12-11T07:59:08+05:30 IST