సహకార డెయిరీల పాపమేమిటి?

ABN , First Publish Date - 2020-12-03T08:56:45+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఒక్క అమూల్‌ డెయిరీపైనే వల్లమాలిన ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నదని, మన రాష్ట్రంలోని సహకార పాల డెయిరీలు ఏం పాపం

సహకార డెయిరీల పాపమేమిటి?

అమూల్‌పైనే ఎందుకంత ప్రేమ?.. ఆసంస్థకోసం అప్పుచేసి వసతులు

వడ్డీలకే ఏటా రూ.500 కోట్ల భారం.. హెరిటేజ్‌కు నష్టమేమీ లేదు

చిన్న డెయిరీలను చంపే కుట్ర ఇది: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఆరోపణ


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ఒక్క అమూల్‌ డెయిరీపైనే వల్లమాలిన ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నదని, మన రాష్ట్రంలోని సహకార పాల డెయిరీలు ఏం పాపం చేసుకొన్నాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. లోకేశ్‌ కుటుంబ యాజమాన్యంలో హెరిటేజ్‌ డెయిరీ నడుస్తున్న విషయం తెలిసిందే. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకొన్న ఒప్పందం గురించి విలేకరులు ప్రస్తావించగా, ఆయన స్పందించారు. ‘‘హెరిటేజ్‌ ప్రైవేట్‌ డెయిరీ. మాకేమీ ప్రభుత్వ మద్దతు అవసరం లేదు. విజయ, సంగం, విశాఖ వంటి డెయిరీలు సహకార రంగంలో ఎప్పటి నుంచో రాష్ట్రంలో పని చేస్తున్నాయి. ఎక్కడో గుజరాత్‌లో ఉన్న డెయిరీని తీసుకువచ్చి సకల సౌకర్యాలు దానికి కల్పించి పాలను ప్రభుత్వమే సేకరించి ఇచ్చే బదులు....అవే సదుపాయాలు రాష్ట్రంలోని సహకార డెయిరీలకు ఇస్తే అవి ఇంకా అభివృద్ధి అవుతాయి కదా? ఇవే సదుపాయాలు కల్పి స్తే అమూల్‌ కంటే ఎక్కువ ధరను అవి పాడిరైతులకు ఇస్తాయి. మన రాష్ట్రంలో డెయిరీలను అభివృద్ధి చేస్తే నేరమా? ఎక్కడో ఉన్న కంపెనీని తెచ్చి ఎందుకు నెత్తి మీద పెట్టుకొంటున్నారు? అందులో లోగుట్టు ఏమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు. అమూల్‌ సంస్థ కోసం గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, పాల నిల్వకు  శీతలీకరణ కేంద్రాలు, రవాణా సదుపాయాలు వంటివన్నీ మొత్తం ప్రభుత్వమే సమకూర్చి పెడుతోందని, దీనికోసం సుమారుగా రూ.మూడు వేల కోట్లు అప్పుగా  తెచ్చి ఖర్చు పెట్టబోతున్నారని ఆయన తెలిపారు. అసలు, వడ్డీ కింద కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తానికి ఏటా రూ.500 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, మన రాష్ట్రానికి ఏ సంబంధం లేని కంపెనీ కోసం ఇంత భారం రాష్ట్రంపై వేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలోని పాలు మొత్తాన్ని ప్రభుత్వమే రైతుల నుంచి సేకరించి అమూల్‌ కంపెనీకి ఇస్తే హెరిటేజ్‌ డెయిరీ దెబ్బ తినిపోయి మూత పడుతుందని వైసీపీ నేతలు అనుకొంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి మొత్తం 70 డెయిరీలు పాలను కొంటున్నాయి. ఒక్క హెరిటేజ్‌ మాత్రమే కొనడం లేదు. మాకు ఇక్కడ పాలు తగ్గితే మేం వేరే రాష్ట్రం వెళ్లి కొనుగోలు చేయగలం. పెద్ద డెయిరీలు అన్నీ అదే పని చేస్తాయి. హెరిటేజ్‌ పాల సేకరణ వ్యవస్థ అనేక రాష్ట్రాలకు విస్తరించి ఉంది. ప్రభుత్వ నిర్ణయం చిన్న డెయిరీలను బాగా దెబ్బ తీస్తుంది. ప్రభుత్వం ఒక కంపెనీకే  సకల సౌకర్యాలను కల్పించి ఇవ్వడం వల్ల చిన్న డెయిరీలు తట్టుకోలేక మూతపడే ప్రమాదం ఉంది. చివరకు నాలుగైదు డెయిరీలు మాత్రమే ఇక్కడ మిగులుతాయి. చిన్న పరిశ్రమలను, చిన్న పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం చంపేస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. 

వైసీపీ నేతలకూ డెయిరీలు

అమూల్‌ డెయిరీ రైతులకు లీటర్‌కు రూ.4 ఎక్కువ ఇస్తుందన్న ప్రచారం కూడా నిజం కాదని, ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఇన్ని సదుపాయాలు కల్పిస్తే మన రాష్ట్రంలోని సహకార డెయిరీలు కూడా ఆ ధర ఇవ్వగలవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలకు కూడా అనేక మందికి పాల డెయిరీలు ఉన్నాయని, మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డికి శివశక్తి పేరుతో చిత్తూరు జిల్లాలో డెయిరీ ఉందని  ఆయన తెలిపారు. అందరి కంటే రైతులకు అతి తక్కువ ధరను పాల సేకరణకుగాను ఆ డెయిరీనే ఇస్తోందని, మిగిలిన డెయిరీలతో పోలిస్తే ఒక లీటర్‌కు  ఎనిమిది రూపాయలు తక్కువ ఇస్తోందని  ఆయన చెప్పారు. ఆయన డెయిరీ పాలు సేకరించే ప్రాంతంలోకి ఇతర డెయిరీలను అడుగు పెట్టనీయకుండా అడ్డుకొంటున్నారని, అందువల్ల ఆ డెయిరీ తక్కువ ధరకే పాలను  కొనుగోలు చేయగలుగుతోందని లోకేశ్‌ విమర్శించారు. 

Updated Date - 2020-12-03T08:56:45+05:30 IST