డిక్లరేషన్‌పై సుబ్బారెడ్డి వ్యాఖ్యలు విడ్డూరం: టీడీపీ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-09-21T16:48:56+05:30 IST

తిరుమల వచ్చే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వై.వీ.సుబ్బారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బీ.చెంగల్రాయుడు వ్యాఖ్యానించారు.

డిక్లరేషన్‌పై సుబ్బారెడ్డి వ్యాఖ్యలు విడ్డూరం: టీడీపీ ఎమ్మెల్సీ

అమరావతి: తిరుమల వచ్చే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన  అవసరం లేదని వై.వీ.సుబ్బారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బీ.చెంగల్రాయుడు వ్యాఖ్యానించారు. డిక్లరేషన్‌కు సంబంధించి, ప్రభుత్వం గానీ, టీటీడీ గానీ ఏదైనా కొత్త చట్టం తెచ్చిందేమో సుబ్బారెడ్డి చెప్పాలని అన్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్‌లో సంతకం పెట్టమని అక్కడున్న అధికారి చెప్పి, జగన్‌తో చీవాట్లు తిన్నాడని గుర్తుచేశారు. డిక్లరేషన్‌లో సంతకం పెట్టాలని ఎవరు చెప్పారని... అలా పెట్టకపోతే వెంకటేశ్వరస్వామి ఏం చేస్తాడని.. రథాలు తగలబడితే ఎవరికి ఏమైంది అని కొడాలి నాని మాట్లాడటం ప్రభుత్వ పథకంలో భాగమే అని విమర్శించారు. ప్రభుత్వం కావాలనే హిందువులపై, ఆలయాలపై విమర్శలు చేస్తూ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. మంత్రి స్థాయిలో ఉన్నవ్యక్తి చట్టాలను, నిబంధనలను గౌరవించకపోతే, ప్రజలు పాటిస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు హిందూమత నిబంధనలను, టీటీడీ ఆచారాలు - సంప్రదాయాలు మంటగలిపితే, సామాన్యులు వాటిని ఎలా గౌరవిస్తారని నిలదీశారు. టీటీడీ నిబంధనలను బ్రిటీషు వారు కూడా గౌరవించారని చెప్పుకొచ్చారు. క్రిస్టియన్ అయినంతమాత్రాన జగన్ హిందూ దేవాలయాల్లో ఇష్టానుసారం ప్రవర్తిస్తాడా అని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి చూడబోతే తిరుమల కొండపై కూడా బార్లు  పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.


పూరీ జగన్నాథ ఆలయంలో నిబంధనలు పాటించలేదని మహాత్మాగాంధీనే అనుమతించలేదని తెలిపారు. రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలామ్ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చినప్పుడు అడిగిమరీ డిక్లరేషన్‌లో సంతకం పెట్టారని గుర్తుచేశారు. సోనియాగాంధీ పుట్టుకతో క్రిస్టియన్ అయినా హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి, ఆయన మతమే తన మతమని చెప్పిందన్నారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తిరుమల వచ్చిన నిషార్ అహ్మద్ కుక్రూ కూడా డిక్లరేషన్ ఇవ్వలేనని చెప్పి దర్శనం చేసుకోకుండానే తిరిగెళ్లారని తెలిపారు. స్వామివారికి పట్టువస్త్రాలు దంపతులు మాత్రమే సమర్పించాలనే నిబంధన కూడా అనాదిగా వస్తున్నదే అని ఆయన వెల్లడించారు. మతాలను గౌరవించాలనే మనస్తత్వం పాలకులకు లేకపోతే అది, రాష్ట్రానికే అరిష్టమన్నారు. రాజు ఒక్కడు తప్పు చేస్తే ప్రజలు అంతకు మించి తప్పులు చేస్తారని తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ సొమ్ముని ప్రభుత్వానికి వడ్డీకి ఇస్తానని చెబుతున్న టీటీడీ ఛైర్మన్ స్వామి నిధులను కైంకర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. టీటీడీ సొమ్ము ప్రభుత్వానికి ఇస్తే పాలకులు తిరిగివ్వకపోతే చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటారో సుబ్బారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడుకొండల విషయంలో హేళన చేస్తే తమకే ప్రమాదమని తెలుసుకోవాలని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం స్వామి వారి ప్రతిష్టను కాపాడటం చేతగాకుంటే సుబ్బారెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. .


Updated Date - 2020-09-21T16:48:56+05:30 IST