జయరామ్‌తో రాజీనామా చేయిస్తే ప్రజలు సంతోషిస్తారు: బుద్దా
ABN , First Publish Date - 2020-09-18T22:44:43+05:30 IST
అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్‌లో అన్యాయంగా, కక్షతోనే ఇరికించినట్లుగా తేలిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ‘మంత్రి

అమరావతి: అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్‌లో అన్యాయంగా, కక్షతోనే ఇరికించినట్లుగా తేలిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ‘మంత్రి జయరామ్ తప్పుచేస్తే.. అచ్చెన్నాయుడిని 80 రోజులు అక్రమంగా నిర్బంధించారు. కార్మిక శాఖామంత్రి జయరామ్ కుమారుడు ఈశ్వర్‌కు, ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుడైన కార్తీక్‌కు మధ్య జరిగిన లోగుట్టు వ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెట్టాం. గుమ్మనూరు యువసేన పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలో కార్తీక్ బహుమతిగా ఇచ్చిన బెంజ్ కారును ఈశ్వర్ తీసుకుంటున్న ఫొటో ఉంది. ఈఎస్ఐ స్కామ్‌లో తనకు అడ్డుతగులుందని కార్మికశాఖా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నా ఉదయలక్ష్మీపై మంత్రి జయరామ్ సీఎంవోకు ఫిర్యాదు చేయలేదా? ఈఎస్ఐ స్కామ్‌లో ఏ-14గా ముద్దాయి ఇచ్చిన కారు తీసుకొని అతన్ని రక్షించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని తేలిపోయింది’ అని స్పష్టం చేశారు.
‘స్కామ్‌లు చేసేది వారే.. దోచుకునేది వారే. నిందలు మాత్రం టీడీపీ వాళ్లపై వేయడం వైసీపీ వాళ్లకు అలవాటైంది. అయ్యన్నపాత్రుడితో చర్చకు సిద్ధమంటున్న మంత్రి జయరామ్.. ఏ తేదీన, ఎప్పుడు, ఎక్కడకు చర్చకు రావాలో చెబితే రావడానికి అయ్యన్నపాత్రుడు సిద్ధం. కార్తీక్ నుంచి జయరామ్ కుమారుడికి అందిన ముడుపులను మీడియా ముఖంగా బట్టబయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తక్షణమే జయరామ్‌తో రాజీనామా చేయిస్తే ప్రజలు కొంతైనా సంతోషిస్తారు’ అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.