పోలీస్ అమర వీరులకు జోహార్లు: అనగాని సత్య ప్రసాద్

ABN , First Publish Date - 2020-10-21T18:59:57+05:30 IST

సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలకు కాపలా కాస్తూ అరాచక శక్తులు

పోలీస్ అమర వీరులకు జోహార్లు: అనగాని సత్య ప్రసాద్

అమరావతి: సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ  ప్రజల ధన, మాన, ప్రాణాలకు కాపలా కాస్తూ  అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలు జరిపే వ్యక్తులతో యుద్ధం చేస్తూ  ప్రాణాలు విడిచిన పోలీస్ అమర వీరులకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జోహార్లు తెలిపారు. కరోనా సమయంలో కూడా విధి నిర్వహణకు కట్టుబడి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి  కొంత మంది పోలీసులు అమరులయ్యారన్నారు. వారందరి త్యాగాలను స్మరిస్తూ పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా  నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. పోలీసులు  ప్రజల కోసమే తమ జీవితం అంకితం చేసి కుటుంబానికి దూరంగా 24 గంటల పాటు విధుల్లోనే ఉంటూ సమాజానికి రక్షణగా నిలుస్తున్నారన్నారు.
లాక్‌డౌన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ పంజా విసరకుండా పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉండి తమ కట్టుదిట్టమైన చర్యలతో అడ్డుకున్నారని... వారి కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ క్రమంలో కన్నతల్లి, సోదరుడు మరణించినా.. కడచూపునకు వెళ్లకుండా విధుల్లోనే ఉన్నారని... వారికి సెల్యూట్‌ చేశారు. సమాజ రక్షణ కోసం పోలీసులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారి త్యాగాలను భువి ఉన్నoత వరకు స్మరిస్తూనే ఉంటామని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-21T18:59:57+05:30 IST