కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: యనమల
ABN , First Publish Date - 2020-04-26T18:27:12+05:30 IST
కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: యనమల

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని అనేక నివేదికలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తగ్గించి చూపేందుకు అంకెల గారడీ చేస్తోందని మండిపడ్డారు. కేంద్రాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు శోచనీయమన్నారు. దక్షిణాదిలోనే రెండవ గరిష్ట కేసులున్న రాష్ట్రంగా ఏపీ మారిందని ఆయన తెలిపారు. నెలలోనే కరోనా కేసులు 101% పెరిగాయని... ఇదే వేగంతో విస్తరిస్తే మార్చి 3 కల్లా కేసులు 2 వేలకు చేరతాయనడంలో సందేహం లేదని యనమల పేర్కొన్నారు.
అత్యధికంగా టెస్ట్‌లు చేశామని చెబుతున్నారే తప్ప, పాజిటివ్ కేసులు అత్యధికంగా పెరిగాయని చెప్పడం లేదని మండిపడ్డారు. ఇన్‌ఫెక్షన్ రేటు 1.66%కు తగ్గించి చూపడానికే పరీక్షలు ఎక్కువ చేశామని చెబుతున్నారని ఆరోపించారు. పాజిటివ్ కేసులు 100% పెరిగితే, ఇన్‌ఫెక్షన్ రేటు ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు. ఇదేమి ‘‘రివర్స్’’ లెక్కలో సీఎం జగనే చెప్పాలని అన్నారు. దక్షిణాదిలో రికవరీ రేటు ఏపిలోనే అత్యల్పంగా ఉందని చెప్పారు. కేసుల రేటు తగ్గించి చూపడానికే పరీక్షల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని యనమల ఆరోపించారు. కరోనా కట్టడికి సంబంధించి అన్ని విషయాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు.
ఒక నెలలోనే మరణాలలో 5వ స్థానం చేరిందని... 30రోజుల్లోనే పాజిటివ్ కేసులలో 8వ స్థానానికి చేరిందన్నారు. ఈ వాస్తవాలను ప్రభుత్వం చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. నిన్న ప్రభుత్వ ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందని..ఈ దుస్థితికి ప్రభుత్వమే కారణమని అన్నారు. ఏపీలో కోవిడ్ వైరస్ వ్యాప్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేక పోయిందని... పైగా వైసీసీ నాయకులే వైరస్ వ్యాప్తికి కారకులు అయ్యారని యనమల ఆరోపించారు. వైసీపీ మూర్ఖపు చేష్టలతో ప్రజల ప్రాణాలనే బలిగొంటోందన్నారు.
ఏ రోజైతే ముఖ్యమంత్రి ఇది మామూలు ఫ్లూ లాంటిదేనని తేలిగ్గా చెప్పారో, ఆ రోజుకన్నా ప్రస్తుతం కేసులు 100% పెరగడానికి జవాబుదారీ ఎవరని ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనాను ఈ ప్రభుత్వం ఎంత తేలిగ్గా తీసుకుందో సీఎం పారాసిటమాల్, బ్లీచింగ్ వ్యాఖ్యలే రుజువు చేశాయన్నారు. సీఎం వ్యాఖ్యలతో వైసీపీ నాయకులంతా తేలిగ్గా తీసుకున్నారన్నారు. మే 16కల్లా కొత్త కేసులు తగ్గుతాయని నీతి అయోగ్ అంచనా వుంటే, ఏపీలో మాత్రం కొత్త కేసులు రోజురోజుకూ పెరగడం వైసీపీ ప్రభుత్వ చేతగానితనమే అని దుయ్యబట్టారు.
ఏపీకి రానున్న కేంద్ర బృందానికి కరోనా కట్టడిలో ప్రభుత్వం ఏవిధంగా విఫలమైందో వీడియోలతో సహా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఫలితం లేదని... ప్రజలే స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవాలని యనమల రామకృష్ణుడు సూచనలు చేశారు.