జగన్ రెండు నిమిషాలు కాళహస్తిపై దృష్టిపెడితే...: సుధీర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-12T18:19:25+05:30 IST

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నడూ చూడని దారుణాలు వైసీపీ హాయాంలో చూస్తున్నామని టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్ రెండు నిమిషాలు కాళహస్తిపై దృష్టిపెడితే...: సుధీర్‌రెడ్డి

అమరావతి: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నడూ చూడని దారుణాలు వైసీపీ హాయాంలో చూస్తున్నామని టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవాలయంలో కాశీవిశ్వనాథుని మందిరంలో అనామకుడు నంది, లింగం ప్రతిష్టించే వరకు అక్కడున్న వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముగ్గురు వ్యక్తుల సాయంతో స్థానిక ఎమ్మెల్యే గుడిని, వ్యాపార కేంద్రంగా మార్చాడని ఆరోపించారు. స్థానిక ప్రజలంతా ఎమ్మెల్యేని కలెక్షన్ కింగ్‌గా పిలుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. విజయ్ సారథి, ధన్‌పాల్, రామూలను తక్షణమే దేవాలయ సెక్యూరిటీ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.


నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లను బెదిరించి, వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్వర్ణముఖి నదిలోని ఇసుక రీచ్ పాయింట్ నుంచి రోజుకి రూ.2 లక్షల వరకు ఆదాయం ఎమ్మెల్యేకు పోతోందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే బావమరిది శ్రీధర్ రెడ్డి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండి, భూ వివాదాలను పరిష్కరిస్తూ, దోపిడీ చేస్తున్నాడని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పోలీసులు జగన్మోహన్ రెడ్డికి,  వైసీపీ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారారన్నారు కాళహస్తిలో చంద్రబాబు నాయుడి పాలనలో 23 పరిశ్రమలకు అనుమతులిస్తే, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సదరు పరిశ్రమల వారిని మామూళ్ల కోసం బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియవంటే ఎవరూ నమ్మరన్నారు. జగన్ రెండు నిమిషాలు కాళహస్తి నియోజకవర్గంపై  దృష్టి పెడితే, ఎమ్మెల్యే అవినీతి బాగోతం తెలుస్తుందని చెప్పారు. జగన్ పాలన చూశాక రాజకీయాలు ఇంత దారుణంగా, నీచంగా ఉంటాయా అనిపిస్తోందని సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-09-12T18:19:25+05:30 IST