టీడీపీ నేత పట్టాభిపై నిఘా!

ABN , First Publish Date - 2020-06-23T09:14:01+05:30 IST

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. విజయవాడలోని ఆయన ఇంటి వద్ద కొంతమంది

టీడీపీ నేత పట్టాభిపై నిఘా!

  • విజయవాడలో ఇంటివద్ద పోలీసుల మోహరింపు


విజయవాడ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. విజయవాడలోని ఆయన ఇంటి వద్ద కొంతమంది పోలీసులు సోమవారం ఉదయం మోహరించారు. దీంతో ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారనే నెపంతో పట్టాభిని అరెస్టు చేసేందుకే పోలీసులు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు కూడా పట్టాభి ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడ పోలీసుల హైడ్రామా నడిచింది. అయితే తన ఇంటి వద్ద పోలీసులు మోహరించి తనను గృహనిర్భందంలో ఉంచడంపై పట్టాభి తీవ్రంగా స్పందించారు.


108 అంబులెన్స్‌ల నిర్వహణలో అవినీతి బాగోతాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టానని, ఇందులో ప్రధాన సూత్రధారి అయిన విజయసాయిరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్తారని భావిస్తే.. తన ఇంటికి రావడమేమిటని నిలదీశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని, ప్రభుత్వ చర్యలన్నీ దాని ప్రకారమే ఉన్నాయని వ్యాఖ్యానించారు. మీడియా కూడా అక్కడే ఉండడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. దీనిపై విజయవాడ పటమట సీఐ సురేశ్‌ రెడ్డి స్పందించారు. పట్టాభి ఇంటి వద్ద తాము ఎలాంటి నిఘా పెట్టలేదన్నారు. రాజకీయ నాయకుల రోజువారీ కార్యక్రమాల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు నాయకుల ఇళ్లకు వెళ్లడం సర్వసాధారణమని, ఆ విధంగానే సోమవారం ఉదయం తమ సిబ్బంది పట్టాభి ఇంటికి వెళ్లారని.. అంతేతప్ప ప్రత్యేకమైన కారణాలేమీ లేవని చెప్పారు. 

Read more