మీడియాపై దాడి పిరికిపంద చర్య: పంచుమర్తి

ABN , First Publish Date - 2020-05-09T17:54:00+05:30 IST

మీడియాపై దాడి పిరికిపంద చర్య: పంచుమర్తి

మీడియాపై దాడి పిరికిపంద చర్య: పంచుమర్తి

అమరావతి: ఏపీలో రాబందుల పాలన నడుస్తోందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ టీవీ5 కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామని.. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న వారే ఈ దాడి చేశారని ఆరోపించారు. మీడియాపై దాడి పిరికిపంద చర్య అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. జనవరి, ఫిబ్రవరిలో వందల్లో వచ్చిన కరెంటు బిల్లు మార్చి నెలొచ్చే సరికి వేలల్లో రావడమేంటని ప్రశ్నించారు.


కరోనా వచ్చాక కాదు... వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే ఏపీ లాక్‌డౌన్ అయ్యిందని పంచుమర్తి దుయ్యబట్టారు. పరిశ్రమలు, పెట్టుబడులు వెనక్కిపోయాయన్నారు. టీడీపీ హయాంలో సంక్షేమానికి పెద్ద పీట వేశామని... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపామని చెప్పారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఏడాది వైసీపీ పాలనలో రూ. 77 వేల కోట్లు అప్పు చేశారన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని...ఐదేళ్లు నాణ్యమైన విద్యుత్ అందించామని పంచుమర్తి అనురాధ గుర్తుచేశారు. వైసీపీ పాలనలో రూ. 40 వేల కోట్లు ప్రజలపై భారం వేశారన్నారు.


ఇష్టానుసారంగా ఇసుక, సిమెంటు, ఆర్టీసీ ధరలు పెంచేశారని విమర్శించారు. మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. ప్రతి నెలా ఒక్కో మంత్రి రూ.3 లక్షల 35 వేలు జీతం తీసుకుంటున్నారన్నారు. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న సొమ్ము తింటే సరిపోదని.. ప్రజలకు ఉపయోగపడే పనులూ చేయలని హితవు పలికారు. కరోనా కేసుల పెరుగుదలపై వైద్యశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


రైతులను నట్టేట ముంచిన మంత్రి కన్నబాబు ఎక్కడ అని నిలదీశారు. ఎల్జీ పాలిమర్స్‌కు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తూ మంత్రులు పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై పెట్టే కేసులు అంత చిన్నవా అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్క చాన్స్ ఇచ్చి తప్పుచేశామని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎల్లకాలం నియంత పాలన నడవదని... వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. 

Updated Date - 2020-05-09T17:54:00+05:30 IST